26 April, 2026 | 2:48 AM

1౦న రాష్ట్రానికి మోదీ

26-04-2026 01:18 AM
  1. రూ.7,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం
  2. పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మందితో సభకు బీజేపీ కసరత్తు 
  3. మూడో సారి పీఎం అయ్యాక తొలిసారి తెలంగాణకు

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాం తి): తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. మే ౧౦న ప్రధాని రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో రాష్ట్రంలో 7,500 కోట్ల అభివృ ద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను మోదీ చేయనున్నారని సమాచారం.

సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న ఎంఎంటీఎస్ ఫేజ్-2ను జాతికి అంకితం చేయడం తోపాటు వరంగల్‌లో కొత్తగా నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభించడంతో పాటు వరంగల్ ఆస్పత్రి, పలు రైల్వే ప్రాజెక్టులతోపాటు ఇతర కీలక అభివృద్ధి పనులను ప్రా రంభించనున్నట్లు తెలుస్తోంది. అలాగే బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ని ర్మించిన విభాగాలను ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా పలు జాతీయ రహదారుల నిర్మాణ పనులకు భూమిపూజ చేసే అవకాశముంది.

అయితే ప్రధాని మోదీ పర్యటనను రాష్ట్ర బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది. మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు సన్నద్ధ మయ్యారు. సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మోదీ సభకు జనాలు ఎక్కువ వచ్చేలా కసరత్తు చే స్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో డివిజన్ నుంచి 1500 మంది సభకు తీసుకు వచ్చేలా టార్గెట్ ఇవ్వనున్నారు. అలాగే స్ట్రీట్ వెండర్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు సభకు ఎక్కువగా హాజర య్యేలా బీజేపీ వ్యూహ రచన చేస్తున్నది.