05-07-2024 01:34:24 AM
ఆస్ట్రియాకూ వెళ్లనున్న ప్రధాని
న్యూఢిల్లీ, జూలై 4: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 8 నుంచి 10వరకు రష్యా, ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. ఈ మేరకు విదేశాంగశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. 8 తేదీల్లో మోదీ మాస్కోలో ఉంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో 22వ భారత్ వార్షిక సమ్మిట్‌లో చర్చలు జరుపుతారు. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షి సంబంధాలు, వాణిజ్యం, రక్షణ ఇతర రంగాల్లో పరస్పర సహకార ప్రాజెక్టులను ఈ సదస్సులో పూర్తిగా సమీక్షిస్తారని విదేశాంగశాఖ తెలిపింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత భారత ప్రధాని రష్యాలో పర్యటించటం ఇదే తొలిసారి.
దీంతో పశ్చిమదేశాల దృష్టి మోదీ పర్యటనపై పడింది. 9వ తేదీన మోదీ ఆస్ట్రియా వెళ్తారు. 41 ఏండ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటిస్తున్నారు. 1983లో చివరిసారి నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆస్ట్రియాలో పర్యటించారు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఆ దేశ అధ్యక్షుడు అలగ్జాండర్ వాన్‌డెర్ బెల్లెతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. 10వ తేదీని తిరిగి భారత్ చేరుకొంటారు.