calender_icon.png 23 November, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూనివర్సిటీల్లో నియామకాలెప్పుడు?

23-11-2025 12:00:00 AM

  1. కాంట్రాక్ట్ అధ్యాపకులు, తాత్కాలిక అధ్యాపకులతోనే బోధన
  2. విడుదలకాని బిల్లులు.. తప్పని ఇబ్బందులు
  3. కేయూలో జర్నలిజం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుపై అధికారుల వివక్ష!

కాకతీయ విశ్వవిద్యాలయం, నవంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో నియామకాలు జరుగక కాంట్రాక్ట్ అధ్యాపకులు, తాత్కాలిక అధ్యాపకులతో బోధన, ప్రాక్టికల్స్ చేయిస్తున్నారు. విశ్వవిద్యాలయాలు ప్రయోగశాలలకు అడ్డా నానుడి నుంచి విద్యార్థులు మొక్కుబడిగా హాజరయ్యే పరిస్థితి కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో బడ్జెట్ ఆమోదం పొందిన పోస్టులలో దాదాపు 900 మందికి పైగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన, 650 మంది పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన పనిచేస్తున్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, వివిధ విద్యాసంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసిన అందరినీ రెగ్యులర్ చేసింది. అయితే విశ్వవిద్యాలయాల్లో పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులను మాత్రం నిర్లక్ష్యం చేసింది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి జీవో నెంబర్ 21 ద్వారా నియామకం చేయడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది.

కేసీఆర్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన అధ్యాపకులపై సుప్రీం కోర్టు కన్నెర్రజేసింది. ఉద్యోగాలు లేక ఏళ్లతరబడిగా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే అధ్యాపకుల్లో కూడా పదవి విరమణ పొందారు. అయితే పని ఒత్తిడి ఉన్న పార్ట్ టైం అధ్యాపకులు పదవి విరమణకు దగ్గరగా ఉన్నందున, కాంట్రాక్ట్ అధ్యాపకులుగా గుర్తించాలని అధికారులకు అనేక దఫాలుగా విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. 

కాకతీయలో అధ్వాన పరిస్థితిలు

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఏండ్ల తరబడిగా పనిచేస్తున్న అధ్యాపకులకు ఆర్డర్లు ఇవ్వక పోవడం ఒకవైపు, అధ్యాపకులు పెట్టుకున్న బిల్లులకు ఏడాదిగా కారణాలు చెప్పకుండా చెల్లించకుండా యూనివర్సిటీ జాప్యం చేస్తుందనే విమర్శ ఉంది. పీజీ జర్నలిజం కోర్సులో ఏడాది కాలంగా అధ్యాపకులు పెట్టుకున్న బిల్లులు చెల్లించనందుకు మూడవ సెమిస్టర్‌లో అధ్యాపకులు క్లాసులు తీసుకోలేదని, ప్రాక్టికల్స్ అంటే ఏమిటో తెలియదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదే  విషయంపై డిపార్ట్‌మెంట్ వర్క్ లోడ్, సిలబస్ సంబంధిత అంశాలపై ఇప్పటికే యూనివర్సిటీ ఆచార్య మల్లికార్జున్‌రెడ్డి చైర్మన్‌గా కమిటీ వేశారు. అధ్యాపకుల బిల్లుల విషయంపై కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం విభాగాధిపతిని డాక్టర్ మల్లేశ్వర్‌ను సంప్రదించగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్ సూచనతో మాజీ వీసీ ఆచార్య రమేశ్ కుట్రపూరితంగా ఆర్డర్లు ఇవ్వలేదని, తదుపరి వచ్చిన ఇన్‌చార్జి వీసీ కరుణ పరిశీలించి ఆర్డర్లు ఇచ్చారు.

కరోనా కాలంలో 2020-21 విద్యా సంవత్సరం అధ్యాపకుల బిల్లులు ఆడిట్‌లో పాసై యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య మనోహర్‌కు పంపిస్తే కమిటీ పేరుతో తొమ్మిది నెలలుగా ఆపారని తెలిపారు. ఇంకా రెండు సంవత్సరాల బిల్లులు చెప్పని రోజులకు ఇవ్వాలని అధ్యాపకులు డిమాండ్ చేస్తున్నారని అందుకే ఆలస్యం అవుతుందని చెప్పారు.

నాడు కోర్సును బ్రతికించటానికి ఒక్క రూపాయి వేతనం తీసుకోలేదని, డిపార్ట్మెంట్ అధ్యాపకులకు కొందరు అధికారులు కాంట్రాక్ట్ ఇప్పిస్తామని నమ్మబలికి, ఫిర్యాదు తీసుకోని ఆందోళనకు ప్రోత్సహించి కమిటీ వేయడానికి కారకులయ్యారని ఆరోపించారు. బిల్లులు ఆలస్యం కావడం వల్ల సిబ్బంది రావడం లేదని, విద్య వాతావరణం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జర్నలిజం తాత్కాలిక అధ్యాపకుల హాజరును పరిశీలించి, బిల్లులు తక్షణమే చెల్లించాలని యూనివర్సిటీ అధికారులను కోరారు.