11-12-2025 04:51:38 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గురువారం మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల నిర్వహణ వెబ్ కాస్టింగ్ ద్వారా నిచితంగా పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా జిల్లా ఎస్.పి. నితికపంత్, ఎన్నికల పరిశీలకులు వి.శ్రీనివాస్ లతో కలిసి మొదటి విడత ఎన్నికల సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ పంచాయతీ ఎన్నికలు-2025 మొదటి విడతలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించడం జరిగిందని, నెట్ వర్క్ లేని పోలింగ్ కేంద్రాలలో వాకీ టాకీ ద్వారా పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎలాంటి అనుచితమైన సంఘటనలు ఏర్పడినా వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.