calender_icon.png 4 December, 2025 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కీసరగుట్టలో కోతుల దాడి..

04-12-2025 12:00:00 AM

  1. భక్తులు, స్థానికుల్లో భయాందోళన

తీవ్ర గాయాలపాలైన అఖిల్.. స్వల్ప గాయాలతో ఆంజనేయులు, పూజారి వెంకటేష్..

కీసర, డిసెంబర్ 3 (విజయక్రాంతి) : కీసర మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రం కీసరగుట్టలో కోతుల బెడద రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఆలయ పరిసరాలు, జనావాసాల్లో కోతుల దాడులు పెరుగుతుండటంతో స్థానిక ప్రజలతో పాటు దర్శనానికి వస్తున్న భక్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల ఓ కోతి దూకుడుగా వ్యవహరిస్తూ పలువురిపై వరుస దాడులకు పాల్పడిందని గ్రామస్థులు,ఆలయ ప్రాంత వాసులు తెలిపారు. ఈ దాడుల్లో అఖిల్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అతని శరీరంపై పలు చోట్ల లోతైన గాట్లు పడి, వైద్యులు 12 వరకు కుట్లు వేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అదే ఘటనలో ఆలయ సిబ్బంది తోటమాలి ఆంజనేయులు, ఆలయ పూజారి వెంకటేష్ స్వల్ప గాయాలతో స్థానికంగా ప్రథమ చికిత్స పొందినట్లు తెలిపారు. సమీప గురుకుల పాఠశాల విద్యార్థులపై కూడా కోతులు దాడి చేసి కరిచాయని, బాధితుల్లో కొందరికి 4 నుంచి 12 కుట్లు పడినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు వెనుకడుగు వేస్తున్నారని, కోతులు వెంబడించడం, కరవడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయని గ్రామస్థులు తెలిపారు. బయటి ప్రాంతాల నుంచి కొందరు వివిధ రకాల కోతులను కీసరగుట్టకు తీసుకొచ్చి వదిలిపెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతుం డటంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది.

కీసరగుట్ట తెలంగాణలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, పర్యాటక గమ్యస్థానంగా ప్రత్యేక గుర్తింపు కలిగి ఉందని, ఇలాంటి ఘటనలు ఆలయ ప్రతిష్టకు, పర్యాటక అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం వెంటనే స్పందించి, దాడులకు పాల్పడుతున్న ప్రమాదకర కోతిని ప్రత్యేక బృందాలతో బంధించి, జనావాసాలకు, భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు  డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కోతుల నియంత్రణకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల భద్రతే ప్రధాన కర్తవ్యంగా తక్షణ చర్యలు తీసుకోవాలని కీసరగుట్ట ప్రాంత ప్రజలు  కోరుతున్నారు.