calender_icon.png 4 December, 2025 | 3:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకాంతాచారి బలిదానంతోనే తెలంగాణ

04-12-2025 12:00:00 AM

  1. ఎమ్మెల్సీ కోదండరాం, జాగృతి అధ్యక్షురాలు కవిత 

ఎల్బీనగర్‌లోని మలిదశ  తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతి 

ఎల్బీనగర్, డిసెంబర్ 3 : మలిదశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి బలిదానంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడిందని, ఎందరో అమరుల త్యాగాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రతినిధులు పేర్కొన్నారు. అమరుడు శ్రీకాంతాచారి 16వ వర్ధంతిని బుధవారం ఎల్బీనగర్ లో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎమ్మెల్సీ కోదండరాం, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారుల సంఘాల నాయకులు తదితరులు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... శ్రీకాంత్ చారి ఆత్మబలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. కేసీఆర్ ఉద్యమంతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తి కలిగి తెలంగాణ సాధ్యమైందని తెలిపారు. తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికి చాటి చెప్పడానికి శ్రీకాంతాచారి ప్రాణం పోతున్న జై తెలంగాణ అంటూ నినాదాలు చేసిన ఉద్యమ వీరుడని అన్నారు.

అమరవీరుల  సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతూ... ఉద్యమకారులను అప్పుడు బీఆర్‌ఎస్ మోసం చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఎల్బీనగర్ అంటేనే ఉద్యమాల పురిటి గడ్డ అని, కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజే శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నాడని గుర్తు చేశారు.

ఆయన స్ఫూర్తితోనే గ్రామాల్లో పట్టణాల్లో ఉద్యమ స్ఫూర్తి రగిలిందన్నారు.  శ్రీకాంతాచారి త్యాగాన్ని మాటల్లో కొలవలేమని, ఎంతోమంది అమరుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంతమందికి మాత్రమే న్యాయం చేసిందని, చాలామంది ఉద్యమకారులకు అన్యాయమే చేసిందన్నారు. అమరులకు న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లను మాత్రమే ప్రస్తావిస్తుందని విమర్శించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీ 250 గజాల స్థలం, పెన్షన్, గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.

డిసెంబర్ 9న దీనిపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కవిత ఖండించారు. తెలంగాణ వాదుల దిష్టితో కోనసీమ పాడయిందని పవన్ కళ్యాణ్ అనడం హాస్యాస్పదమన్నారు. కోనసీమ చాలా బాగుందని కోనసీమ లాగానే తెలంగాణ కూడా ఉండాలని కోరుకున్నామే తప్పా, ఏనాడు కూడా ఆంధ్రాకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. 

డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులర్పించిన వారిలో బీఆర్‌ఎస్ వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ల అధ్యక్షులు చింతల రవి కుమార్, కటికరెడ్డి అరవింద్ రెడ్డి,  బీఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ ఉన్నారు.