నర్మాల గురుకుల పాఠశాలలో కోతుల బెడద
- భయాందోళనలో విద్యార్థులు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి
- ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు తల్లిదండ్రుల వినతి
గంభీరావుపేట, జులై 13 (విజయ క్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కోతుల బెడదతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్పందించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతూ సోమవా రం సిరిసిల్ల సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పాఠశాలలో కోతుల బెడద తీ వ్రంగా పెరిగిందని తల్లిదండ్రులు తెలిపారు.
ఇటీవల ముగ్గురు విద్యార్థులపై కోతులు దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. వసతి గృహాల్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేయడం, భోజనం చేసేటప్పుడు దాడిచేయడం,క్లాస్రూమ్లలోకి ప్రవేశించి పుస్తకాలను చించడం వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ పరిస్థితుల వల్ల విద్యార్థులు భయాందోళనలకు గురవుతున్నారని, వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి పాఠశాల చుట్టూ ప్రహరీ గోడతో పాటు వసతి గృహాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లి తండ్రులు రాజబాబు, శ్రీనివాస్, జలంధర్ తదితరులు ఉన్నారు.






