మహిళా ఉద్యోగినులకు నెలసరి సెలవు
స్వాతంత్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగినులకు నెలలో ఒకరోజు నెలసరి సెలవు
భువనేశ్వర్ (ఒడిశా), ఆగస్టు 15: స్వాతంత్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళా ఉద్యోగినులకు శుభవార్త చెప్పింది. గురువారం కటక్‌లో జరిగిన స్వాతంత్ర వేడుకలో పాల్గొన్న ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పార్వతి పరీదా మాట్లాడుతూ.. రా్రష్ట్రంలోని మహిళా ఉద్యోగినులకు నెలలో ఒకరోజు నెలసరి సెలవు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు ఇది వర్తిస్తుందని ఆమె తెలిపారు.
ఈ పాలసీ తక్షణమే అమల్లోకి వస్తుందని, మహిళా ఉద్యోగినులు ప్రతినెలా తమ పీరియడ్స్ టైంలో మొదటి లేదా రెండో రోజు ఈ సెలవును తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ఉద్యోగినుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తమ రాష్ట్రంలో కూడా ఈ పాలసీని అమలు చేయాలని దేశంలోని వివిధ రాష్ట్రాల మహిళా ఉద్యోగినులు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే నెలసరి సెలవులు అమలవుతున్న రాష్ట్రాలు, విద్యాసంస్థలు
- * బీహార్ (నెలలో రెండు రోజులు)
- * కేరళ (నెలలో మూడు రోజులు)
- * నల్సార్ వర్సిటీ, గుహవాటి వర్సిటీ, తేజ్‌పూర్ వర్సిటీ, పంజాబ్ వర్సిటీ.. విద్యార్థినులకు నెలసరి సెలవులు ప్రకటించాయి.




