14-08-2024 12:05:00 AM
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించడమే తన లక్ష్యమని భారత స్టార్ షూటర్ మనూ బాకర్ పేర్కొంది. ముగింపు వేడుకల్లో మనూ.. శ్రీజేశ్‌తో కలిసి పతకాధారిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తాజాగా స్వదేశానికి చేరుకున్న మనూ ఒలింపిక్స్‌లో భారత ప్రదర్శనపై స్పందించింది. ‘ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు కఠినంగా శ్రమించాం. మా ప్రయత్నం సఫలమయినప్పుడు సంతోషం కలుగుతుంది. భవిష్యత్తులో భారత్ తరఫున మరిన్ని ఒలింపిక్ పతకాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.
శ్రీజేష్ భయ్యాతో ముగింపు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందం వేసింది. నా చిన్ననాటి నుంచి శ్రీజేశ్ ఆటను చూస్తూ పెరిగా. అతడితో కలిసి ఇవాళ పతాకధారిగా వ్యవహరించడం గౌరవంగా భావి స్తున్నా’ అని మనూ తెలిపింది. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీలో జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌కు మనూ బాకర్ దూరమయ్యే అవకాశముందని ఆమె కోచ్ జస్పాల్ రానా తెలిపారు. ఒలింపిక్స్ కారణంగా చాలా కాలంగా ట్రైనింగ్‌లో బిజీగా గడిపిందన్నారు. దీంతో మనూ మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోనుందని పేర్కొన్నారు.