భూమాత ప్రకోపం
భూకంపాలకు ఆవాసమైన అఫ్గానిస్థాన్ మరోసారి వణికిపోయింది. నిత్యం ఘర్షణలు, అంతర్యుద్ధాలతో నలిగిపోతున్న ఆఫ్గాన్ దేశం భూమాత ప్రకోపానికి విలవిల్లాడిపోయింది. ఆదివారం రాత్రి 11.37 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైన భూకంపం ఆ దేశానికి కాళరాత్రిని మిగిల్చింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 1400 మందికి పైగా మృతి చెందగా.. 3 వేల మందికి పైగా గాయపడ్డారు. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఈ భూకంపం కునార్, నంగర్‌హార్ ప్రావిన్స్‌లను కుదిపేసింది. ఆ సమయంలో చాలా మంది గాఢ నిద్రలో ఉండటంతో ఇళ్ల పైకప్పులు కూలి అంతా సజీవ సమాధి అవ్వడం కలచివేసింది. తాలిబన్ల సహాయక చర్యలు అంతంతమాత్రమే కావడంతో తమ వాళ్లను వెతికే క్రమంలో అక్కడి స్థానికులు చేతులతోనే మట్టి పెళ్లలు తొలగిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. భౌగోళికంగా ఇండియా, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ల మధ్య అఫ్గానిస్థాన్ ఉంది.
ఈ భూఫలకాల మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణలతోనే అఫ్గాన్‌లో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. 1900 నుంచి 2025 వరకు అఫ్గానిస్థాన్‌లో దాదాపు 100 భూకంపాలు సంభవించాయి. 2023 అక్టోబరులోనూ 6.3 తీవ్రతతో అఫ్గాన్‌లో భూకంపం సంభవించగా దాదాపు 4 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ అఫ్గాన్‌లో మరణాలు సంఖ్య ఎక్కువగా ఉండడం ఆశ్చర్యపరుస్తుంది.
అయితే అఫ్గానిస్థాన్‌లో నిర్మాణాలు అంత బలంగా ఉండవు. చిన్న భూకంపం వచ్చినా నష్టం మాత్రం అపారంగా ఉ ంటుంది. ఆ దేశంలో చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఇళ్లను మట్టి ఇటుకలతోనే ఎక్కువగా నిర్మిస్తారు. ఇవి చిన్న ప్రకంపనలు కూడా తట్టుకోలేవు. అందుకే తక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చినా ప్రాణనష్టం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. విపత్తు నిర్వహణ వ్యవస్థ కూడా అఫ్గాన్‌లో సరిగా లేకపోవడం కూడా మరొక ప్రధాన కారణం.
ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడే ముందు ఏదో ఒక రకమైన సూచనలు ఇస్తుంటాయి. కానీ భూకంపాలు మాత్రం చెప్పా పెట్టకుండా విరుచుకుపడతాయి. శాస్త్రవేత్తల ప్రకారం భూగర్భం ఏడు ఫలకలుగా విడిపోయి ఉంటుంది. వీటిల్లో వచ్చే కదలికలూ, రాపిడిల పర్యావసానంగా ఆకస్మిక శక్తి విడుదలవుతుంటుంది. ఆ శక్తి తరంగాలు భూ ఉపరితలానికి చేరుకోవడం వల్ల భూకంపాలు సంభవిస్తుంటాయి.
అయితే ఫలానా చోట భూకంపం రావొచ్చని చెప్పగలిగే సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ నిర్దిష్టంగా ఎక్కడ, ఎప్పుడు వస్తుందనేది చెప్పడం మాత్రం సాధ్యపడటం లేదు. తాజాగా అఫ్గానిస్థాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై సాధారణమే అయినప్పటికీ నిర్మాణాల్లో లోపం ఉండటం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా ఉంది.
వాతావరణ కాలుష్యం, పెరుగుతున్న భూతాపం, అడవుల విధ్వంసం, అభివృద్ధి పేరిట చేస్తున్న పనులు ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో అమలవుతున్న నమూనాలను మార్చుకోవాల్సిన అవసరముంది.ప్రకృతిని గౌరవించటం నేర్చుకోనంతవరకూ ఇలాంటి వైపరీత్యాలు తప్పవు.






