ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య!
భర్త రెండో పెళ్లితో గొడవలు
పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా ఆగని వేధింపులు
మనస్థాపంతో పిల్లలతో కలిసి తల్లి బలవన్మరణం
భర్తే చంపి, ఆత్మహత్యగా చిత్రించాడని అనుమానం
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): రెండో పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి బలవన్మరాణానికి పాల్పడింది. ఈ ఘటన కూకట్‌పల్లిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం వరంగల్ జిల్లా ఎల్లయ్యగూడెం పంచాయతీలోని మాణిక్యం తండాకు చెందిన బోడ ప్రవీణ్.. అదే పంచాయతీలోని పదహారు చింతల తండాకు చెందిన స్రవంతి (30)ని పదిహేనేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు కుమారులు కార్తిక్ (12), కౌశిక్ (10) ఉన్నారు. వీరు ప్రస్తుతం మూసాపేట పరిధి రాఘవేంద్ర సోసైటీలో నివాసముంటున్నారు. ప్రవీణ్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. స్రవంతికి చెల్లి వరుసయ్యే యువతిని ఏడాది క్రితం ప్రవీణ్ రెండో వివాహం చేసుకున్నట్టు తెలిసింది. అప్పటినుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టినా ప్రవీణ్‌లో మార్పు రాలేదు. మద్యం సేవించి స్రవంతి వద్దకు వచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు.
మూడు రోజుల క్రితం ప్రవీణ్ సొం తూరైన మాణిక్యం తండాలో మళ్లీ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ప్రవీణ్, స్రవంతిలు కలిసి ఉండాలని పెద్దలు తీర్మానించారు. ఇకముందు ఎలాంటి సంఘట నలు జరిగినా పూర్తి బాధ్యత తనదేనని ఒప్పుకొని, బాండ్ పేపర్ రాసి భార్య పిల్లలను ప్రవీణ్ తనతో తీసుకెళ్లాడు. సోమ వారమే నగరానికి చేరుకున్నారు. మంగళవారం ఉదయం ప్రవీణ్ పని నిమిత్తం బయటకు వెళ్లి మధ్యాహ్నం భోజనానికి తిరిగి వచ్చి చూడగా ముగ్గురు విగతజీవులుగా పడిఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
బిర్యానిలో విషం పెట్టి చంపేశాడు?
ఇదంతా పథకం ప్రకారమే జరిగిందని స్రవంతి బంధువులు ఆరోపిస్తున్నారు. సో మవారం హైదరాబాద్‌కు వెళ్లిన అనంతరం మంగళవారం రాత్రి భార్యను చిత్రహింసలకు గురిచేసి, బిర్యానీలో విషం కలిపి ఇద్దరు కుమారులతో పాటు భార్యను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. అనంతరం వారికి ఉరేసి, ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




