01-02-2026 02:44:19 AM
రాత్రి 7:55 గంటలకు గద్దెలను వీడిన వనదేవతలు
నాలుగు రోజులపాటు వనదేవతల ఆశీస్సులతో ఉప్పొంగిపోయిన మేడారం జాతర శనివారం ముగిసింది. మేడారం విడిచి వనదేవతలు తిరిగి వనం చేరారు. శనివారం రాత్రి పూజారులు సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజును కొండాయికి తీసుకెళ్లి వనప్రవేశం చేయించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి సైతం ఈసారి భక్తులు మేడారం వచ్చారు. కోటి ఎనభై లక్షలకు పైగా భక్తులు జాతరకు వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మేడారం జాతరలో ఆర్టీసీ బస్సుల ద్వారా వచ్చిన ప్రయాణికులు తిరుగుముఖం పట్టేందుకు గంటల తరబడి నిరీక్షించారు. జాతరలో ఏర్పాటుచేసిన బస్టాండ్ భక్తులతో కిక్కిరిసిపోయింది. తాడ్వాయి, పసరా మధ్య రెండు రోజులపాటు తరచుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సులువుగా ఆర్టీసీ బస్సుల్లో మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకుని వెళ్లే అవకాశం ఉందనుకున్న భక్తులు గంటల తరబడి బస్సుల్లోనే నిరీక్షించారు. ఈసారి జాతరలో హంగు ఆర్భాటానికే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శలు వచ్చాయి.
మేడారం, జనవరి 31 (విజయక్రాంతి): మేడారం మహా జాతరలో భక్తకోటికి మూడు రోజులపాటు అనుగ్రహాన్ని ప్రసాదించిన వనదేవతలు మేడారం విడిచి తిరిగి వనం చేరారు. శనివారం రాత్రి పూజారులు సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మ ను కన్నెపల్లికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తీసుకెళ్లి వనప్రవేశం చేయించారు. రాత్రి 7:55 గంటలకు గద్దెలను వీడిన తల్లులు వన ప్రవేశం చేశారు. దీంతో ఈ నెల 28 నుంచి 31 వరకు నిర్వహించిన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసినట్టు పూజారులు ప్రకటించారు.
రెండు రోజులపాటు వనదేవతలు భక్తులకు మేడారం గద్దెల పైనుంచి అనుగ్రహం ప్రసాదించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి సైతం ఈసారి భక్తులు వనదేవతల దర్శనానికి వచ్చారు. సుమారు కోటి ఎనభై లక్షలకు పైగా భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు అధికార అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 251 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి, 150 కోట్ల రూపాయలతో మేడారం సమగ్ర అభివృద్ధి తో పాటు 101 కోట్ల రూపాయలతో గద్దెల ప్రాంగణాన్ని ఆదివాసి జీవన సంస్కృతి సంప్ర దాయాలు, సమ్మక్క సారలమ్మ వంశాన్ని, గొట్టు గోత్రాలను రాతి శిలలపై చెక్కించి మహా అద్భుత శిలాకృతిలో నిర్మించారు.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి హైదరాబాదు బయట మారుమూల దట్టమైన అటవీ ప్రాంతం మేడారంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించి సరికొత్త అధ్యాయానికి తెర తీశారు. 100 రోజుల్లోనే మేడారం అభివృద్ధి పనులను నిర్వహించి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సీతక్క పర్యవేక్షణలో మంత్రులు కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ నేతృత్వంలో మేడారం జాతర నిర్వహణలో 42,000 మందికి పైగా అధికారులు, సిబ్బంది భాగస్వాములయ్యారు.
అంతా పోలీసుల పెత్తనమే!
మేడారం జాతరలో పోలీసుల పెత్తనం చెలాయించడం పరిపాటిగా మారిందని, ఈసారి కూడా అదే తరహా కొనసాగిందనే విమర్శలు అటు పూజారులు, ఇటు భక్తులనుంచి వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఈసారి పూర్తిగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని, ఇందుకోసం ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసిందని, చివరకు వీఐపీ పాసులు కూడా పంచి పెట్టలేమని, వీఐపీలు, వీవీఐపీలు అర్థం చేసుకోవాలని మంత్రి సీతక్క ప్రకటించారు. అయితే జాతర ప్రారంభం కాగానే పూర్తిగా పోలీసుల పెత్తనంలోకి వెళ్లిపోయిందని, ఇతర శాఖల అధికారులకు కనీసం గౌరవం ఇవ్వలేదని, ఆఖరికి పూజారులను కూడా పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.
పోలీసువారి వాహనమైనా, వారి కుటుంబ సభ్యులైన నేరుగా మేడారం చేరుకోవడం, గద్దెల ప్రాంగణాన్ని చేరుకొని వన దేవతలను దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారని, ప్రత్యేకంగా ఇందుకోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి దర్శనానికి ఏర్పాట్లు చేసుకున్నారనే విమర్శలు వచ్చాయి. కొందరు వనదేవతల జాతరలో వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, భక్తులకు విశిష్టంగా సేవలు అందించినప్పటికీ మరికొందరు కేవలం జాతరలో తమవారికి పెద్దపీట వేసి దర్శన భాగ్యం కల్పించే విధంగా పనిచేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ముందుగా 300.. తర్వాత 100కు రెండు
ఇది మేడారంలో కోళ్ల ధర
మేడారం జాతర ముందుగా బ్రాయిలర్ కోడి ధర 300 రూపాయలకు విక్రయించగా, జాతర చివరి రోజు శనివారం 100 రూపాయలకు రెండు కోళ్లు విక్రయించారు. జాతరకు వచ్చే భక్తుల్లో అత్యధికులు సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడం, వెంటనే తిరుగు ప్రయాణం చేయడానికి అత్యధికులు ప్రాధాన్యం ఇచ్చారు.
దీనితో భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కోళ్ల దుకాణం నిర్వాహకులు ప్రధాన జాతర జరిగే శుక్ర శనివారాల్లో గిరాకీ లేక తెచ్చిన కోళ్లను తిరిగి తీసుకువెళ్లే పరిస్థితి లేక అగ్గువ ధరకు విక్రయించారు. మొదట్లో కాస్త లాభం వచ్చినప్పటికీ చివరలో కోళ్లను తిరిగి తీసుకువెళ్లే రవాణా భారం భరించలేక తక్కువ ధరకు విక్రయించాల్సి వచ్చిందని వాపోయారు. ఈసారి మేడారం జాతర తమకు ఆశించిన లాభాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.