పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారుల ఇక్కట్లు
- కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు
- బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తీరుతున్న వాహనదారులు
ముషీరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పశ్చిమాసియా యుద్ధం నేపథ్యం లో గత నెల రోజుల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెట్రోల్, డీజి ల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో గత రెండు రోజులుగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధి లోని పలు బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉండడంతో కిలోమీటర్ల మేర వాహనదారులు క్యూ లైన్లు కట్టి పెట్రోల్, డీజిల్ కోసం నానా తంటాలు పడుతున్నారు.
వాహనదారులు ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా ఎండలోనే క్యూ లైన్‌లో నిలబడి పెట్రోల్ కోసం వేచి చూస్తున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదనే వదంతులు వ్యాపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకవైపు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ కొరత లేదంటూ పౌర సరఫరా శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ వాహనదారులు అధికారుల మాటలు నమ్మకుండా పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరి పడికాపులు కాస్తున్నారు.






