నాన్‌స్టాప్ నవ్వులు పంచే రంభ ఊర్వశి మేనక
కామెడీ సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్ మరోసారి తనకు బాగా కలిసొచ్చిన జానర్‌లో సందడి చేయబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇందులో సురభి, రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్, వెన్నెల కిషోర్, నరేశ్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సెప్టెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను మంగళవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేశ్ మాట్లాడుతూ.. “నేను సరైన కామెడీ సినిమా చేసి దాదాపు 10 సంవత్సరాలు అవుతోంది. ‘నాంది’ తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు చేశా. కాకపోతే నేను కామెడీని ఎప్పుడూ వదల్లేదు. ఒక మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా. చాలా రోజుల తర్వాత చంద్రమోహన్ వచ్చి ఈ కథ చెప్పారు. నాకు చాలా నచ్చింది. దాదాపు పదేళ్లుగా ప్రేక్షకులు మిస్ అయ్యారనుకున్న నరేశ్‌ను ఇందులో చూస్తారు. రెండున్నర గంటల పాటు మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మేమంతా చాలా కష్టపడ్డాం” అన్నారు.
హీరోయిన్ సురభి మాట్లాడుతూ.. “అల్లరి నరేశ్ నా ఫేవరెట్. ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం ఒక అదృష్టంగా భావిస్తున్నా” అని తెలిపింది. ‘ఈ సినిమా అందరికీ చాలా బాగా నచ్చుతుంద’ని రాశి సింగ్ చెప్పింది. ప్రిష రాజేశ్ మాట్లాడుతూ.. “ఇలాంటి మంచి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పింది. ‘ఈ సినిమా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాన’ని విష్ణుప్రియ తెలిపింది. ‘సెప్టెంబర్ 4న థియేటర్లు దద్దరిల్లిపోతాయి’ అని డైరెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ.. “ఈ సినిమా విడుదలకు ముందే నరేశ్‌తో మరో సినిమాను అనౌన్స్ చేయబోతున్నా. ఈ సినిమా మీద అంత నమ్మకంతో ఉన్నా” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ నందు, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, ఎడిటర్ చోటా కే ప్రసాద్ కూడా మాట్లాడారు.






