13-11-2025 01:12:41 AM
నలుగురి మధ్య బంతాట.. మైనార్టీ సంక్షేమ శాఖలో విచిత్ర పరిస్థితి
* ఊరందరిదీ ఒక దారి అయితే.. ఉలిపిరి కట్టెది మరోదారి అన్న చందంగా మారింది మైనారిటీ సంక్షేమ శాఖది. అన్ని శాఖల్లో ఫైళ్లు చకచకా కదులుతుంటే.. మైనారిటీ సంక్షేమ శాఖలో మాత్రం.. అక్కడ నెలకొన్న విచిత్ర పరిస్థితి కారణంగా అధికారులు, వారితోపాటు ఫైళ్లుకూడా త్రిశంకు స్వర్గంలో తిరుగుతున్నాయి. ఇందుకు కారణం.. నలుగురు పైస్థాయి ప్రజాప్రతినిధులు. కరవమంటే కప్పకు కోపం.. విడువుమంటే పాముకు కోపం సామెతలా ఒక్కో ఫైలు క్లియరెన్స్ విషయంలోగానీ, వివిధ పథకాల అమలులోగానీ నలుగురు ఉన్నత ప్రజాప్రతి నిధుల మధ్య అగమ్యగోచర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు ఆ ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి) : రాష్ట్రంలోని ముఖ్యమైన శాఖల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఒకటి. దీనికి మంత్రిగా తాజాగా.. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. దీనితో పూర్తిస్థాయిలో తమ శాఖను చూసుకునేందుకు ఒక మంత్రి వచ్చారని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది సంతోషించారు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు. మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పరిస్థితి మరింత దయనీయం అయ్యింది.
ఎందుకంటే.. ఈ శాఖపై అజమాయిషీ చేసేందుకు మంత్రి ఉండగా, మరోపక్క మైనారిటీ సంక్షేమాన్ని చూస్తున్న మాజీ మంత్రి ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఉన్నారు. దీనికితోడు తాజాగా సీని యర్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని తీసుకొచ్చి.. సలహాదారుగా నియ మిస్తూ.. ముఖ్యమైన సంక్షేమం, అభివృ ద్ధి పథకాలపై అజామాయిషీ కల్పించా రు. ఇవన్నీ దాటుకుని వెళితే.. సీఎం కార్యాలయంలో ఉన్న మరో అనధికార నేత ఫైళ్ల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారని సదరు శాఖ అధికారులు, సిబ్బంది తలపట్టుకుంటున్నారు.
సమన్వయం ఎలా..
మైనారిటీ సంక్షేమానికి సంబంధించి ఏదైనా ఫైలు, సంక్షేమ పథకానికి సంబంధించి తీసుకువెళితే.. మంత్రి చెప్పింది విని.. ఆ విధంగా మార్పులు చేస్తున్నారు. అదే ఫైలును.. పరిశీలించిన మైనారిటీ సంక్షేమ సలహాదారు మరికొన్ని మార్పు ల సూచిస్తున్నారు. ఇక తాజాగా వచ్చిన ప్రభుత్వ సలహాదారు తనకున్న అనుభవంతో ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రాంలను అమలు చేసేందుకు తనవంతు మార్పులు, చేర్పులను చెబుతున్నారు.
ఇదంతా చేసి.. ఫైలును సీఎం కార్యాలయానికి తీసుకెళితే.. సీఎంకు షాడోలా ఉండే సదరు నేత కీలకమైన సూచనలు అందిస్తుండటంతో.. ఈ నలుగురిని సమన్వయం ఎలా చేయాలో.. అసలు ఫైళ్లు క్లియర్ చేయడం చేతకాక తలలు బాదుకుంటున్నారు. నలుగురి మధ్యన నలిగి పోతున్నామని చర్చించుకుంటున్నారు. కొన్నిసార్లు.. ఈ నలుగురి వద్దకు మీరు వెళ్ళమంటే.. మీరు వెళ్ళండంటూ అధికారులు, వెనుకంజ వేస్తున్నారంటే మైనారిటీ సంక్షేమ శాఖలో నెలకొన్ని విచిత్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
నలుగురు కలిసి చర్చించుకుంటే..
వాస్తవానికి ఏదైనా అంశం చర్చకు వస్తే.. నలుగురు కలిసి చర్చించుకుని అంతమంగా ఏం చేయాలనేది చెబితే సరిపోతుంది. కానీ.. ఒకరికి కుదిరితే మరొకరికి కుదరడం లేదు. అధికారులు, సిబ్బంది ఆయన వద్దకే వెళతారా.. మా వద్దకు రారా అనే భేషజాలు ఉండనే ఉన్నాయి. దీనితో ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి ఫైలు గురించి వివరించి.. వారి సలహా లు, సూచనలు, ఆదేశాల ప్రకారం మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తోంది.
ఇంతా చేసి సీఎం కార్యాలయానికి ఫైలు తీసుకెళితే.. అక్కడ అనధికారిక జోక్యం ఎక్కువవుతోందని అధికారులు నీరసించిపోతున్నట్టు శాఖలో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అక్కడి నుంచి వచ్చే సలహాలు, సూచనలమేరకు ముం దు వెళ్దామంటే.. మళ్ళీ తిరిగి మొదటి నుంచి తిరగాల్సి వస్తోందని సిబ్బంది బెంబేలెత్తుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కొని.. తమను ఒక ఒడ్డున పడేయాలని మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది వేడుకుంటున్నా రు. లేకపోతే ఆ నల్గురి మధ్యన నలిగిపోక తప్పదనే భయం వారిని వెంటా డుతోంది.