calender_icon.png 20 January, 2026 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేంద్రియ పసుపు సాగుపై దృష్టి సారించాలి

20-01-2026 12:41:38 AM

పసుపు బోర్డు మొదటి వార్షికోత్సవంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

నిజామాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆర్గానిక్ పసుపు పంటకు విస్తృత స్థాయిలో డిమాండ్ ఉన్నందున సేంద్రీయ విధానంలో పసుపు పంట సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి, కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు పిలుపునిచ్చారు. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ లో తొలి వార్షికోత్సవ సభ, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎం.పి అరవింద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఐ.ఏ.ఎస్ అధికారిణీ ఎన్.భవానిశ్రీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పసుపు బోర్డు ద్వారా ఏడాది కాలంగా రైతులకు అందించిన తోడ్పాటు, చేపట్టిన కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోర్డు చైర్మన్, కార్యదర్శులు వివరించారు.

ఎం.పి అరవింద్ మాట్లాడుతూ, పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందని, మూడు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత రైతులు అలుపెరుగకుండా కొనసాగించిన పోరాటాలు, నిరవధిక కృషి ఫలితంగా జాతీయ పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది క్రితం నిజామాబాద్ లో ఏర్పాటు చేసిందని అన్నారు. అయితే రైతులు ఆర్గానిక్ పసుపు పంటను సాగు చేస్తే మరింత డిమాండ్ ఉంటుందని ఎం.పి సూచించారు. ఎన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసినా, ఆర్గానిక్ పసుపు పంటను మంచి డిమాండ్ తో కూడిన ధర పొందవచ్చని, ఈ మేరకు ట్రేడర్లను రప్పించే బాధ్యతను బోర్డు స్వీకరిస్తుందని అన్నారు.

రైతాంగానికిపూర్తి సహకారాన్ని అందిస్తాం 

కలెక్టర్ ఇలా త్రిపాఠి  మాట్లాడుతూ, పసుపు రైతుల సాధకబాధకాల గురించి తనకు స్పష్టమైన అవగాహన ఉందని, వారికి ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం తరపున పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని భరోసా కల్పించారు.  పంట సాగుకే పరిమితం కాకుండా, పసుపు ప్రాసెసింగ్ విధానాలలోనూ శాస్త్రీయ పద్ధతులను అవలంభించాలని, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న నూతన పద్ధతులపై అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ఉద్యానవ శాఖ సంయుక్త సంచాలకుడు శ్రీనివాస్ రావు, పసుపు బోర్డు అధికారులు, రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.