calender_icon.png 20 January, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోబా సన్నిధిలో బేటింగ్

20-01-2026 12:41:06 AM

  1. మెస్రం వంశ కొత్త కోడళ్ల పరిచయం
  2. సతీక్ దేవతకు కొత్త కోడళ్ల పూజలు

ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 19 (విజయక్రాంతి): ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా మెస్రం వంశంలో పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కొత్త కోడళ్లను వంశ పెద్దలకు పరిచయం చేసే కార్యక్రమం భిన్నంగా ఉంటుంది. దాన్నే వారు బేటింగ్ (పరిచయం) అంటారు. ఇది ఏటా నాగోబా జాతర సందర్భంగా నాగదేవత సన్నిధిలో నిర్వహించడం అనవాయితీ. ఇందులో భాగంగానే ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోభా సన్నిధిలో మెస్రం వంశపు కొత్త కోడళ్లు సోమవారం తెల్లవారుజామున సతీక్ దేవతల వద్ద బేటింగ్ అయ్యారు.

గిరిజనుల ఆచారం ప్రకారం మెస్రం వంశపు యువకులను వివాహం చేసుకున్నవారు వారి కుల దేవత వద్ద బేటింగ్ అయితేనే మెస్రం వంశపు కోడలుగా గుర్తింపు వస్తుందనేది వారి ప్రగాఢ నమ్మకం. దీంతో నాగోబా సన్నిధిలో బేటింగ్ అయ్యేందుకు ఉపవాస దీక్షలు చేపట్టి, మహా పూజల అనంతరం మెస్రం వంశపు పెద్దల ఆజ్ఞతో కుల దేవత వద్ద బేటింగ్ అయ్యేందుకు అనుమతి తీసుకుంటారు. ఈసారి జాతరలో మెస్రం వంశపు కోడలు 130 మంది బేటింగ్ అయినట్లు వంశ పెద్దలు తెలిపారు. బేటింగ్ అయిన కొత్త కోడళ్లు సతీక్ దేవతలకు పూజలు చేశారు.

ముందుగా ఉపవాస దీక్షలో ఉన్న కొత్త కోడళ్లు మర్రి చెట్ల వద్ద గల కోనేరు నుంచి కలశల్లో నీటిని తీసుకువచ్చి ‘గోవాడ’లో మట్టి కుండలలోనే  ప్రత్యేకంగా నైవేద్యం తయారు చేశారు. మెస్రం వంశపు ఆడపడుచుల ఆధ్వర్యంలో వండిన నైవేద్యంను సతీక్ దేవతలకు నైవేద్యంగా సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్త కోడళ్లు ఉపవాస దీక్షలను విరమించారు.

ఆలయం వద్ద పాము ప్రత్యక్షం

నాగోబా ఆలయం వెనకాల మెస్రం వంశీయులు పెర్సపెన్ పూజలు నిర్వహించే ఏర్పాట్లను ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, పటేల్ మెస్రం బాధిరావు, కటోడ మెస్రం హనుమంతరావు, కోసురావు, ప్రధాన్ దాదేరావ్, కొత్వాల్ మెస్రం తిరుపతి పరిశీలిస్తుండగా ఆలయం వెనుకల ఓ పొడువాటి పాము ప్రత్యక్షమైంది. ఐదు నిమిషాల పాటు ఆ ప్రాంతంలోనే సంచరించింది. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయే క్రమంలో పాము అంతలోనే మాయమైంది. దీంతో మెస్రం వంశీయులు సాక్షాత్తు నాగోబా దేవుడే ప్రత్యక్షమయ్యారని ఆనందం వ్యక్తం చేశారు. 

  1. గిరిజన సంస్కృతికి ప్రతీక

నాగోబా సందర్శనలో మంత్రి జూపల్లి

గిరిజనుల ఆచార వ్యవహారాలకు, వారి విశిష్ట సంస్కృతికి నాగోబా జాతర నిదర్శనమని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేస్లాపూర్ నాగోబా దేవాలయాన్ని మంత్రి సందర్శించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పి.ఓ యువరాజ్ మర్మట్, ఆలయ పూజారులు, మెస్రం వంశీయులు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నాగోబా దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

అనంతరం మంత్రికి శాలువాతో కలెక్టర్, ఎస్పీ సత్కరించి నాగోబా చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల వసతులను కల్పించిందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తానని, వారి అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.