19 August, 2026 | 3:00 AM

పెద్దగొల్లగూడెం ఆశ్రమ పాఠశాలలో ఎంపీ రఘురాంరెడ్డి ఆకస్మిక తనిఖీ

19-08-2026 12:02 AM

అపరిశుభ్ర స్టాక్ రూమ్‌లను పరిశీలించి అధికారులపై మండిపడిన ఎమ్మెల్యే జారె

దమ్మపేట, ఆగష్టు 18 (విజయక్రాంతి): దమ్మపేట మండలంలో పలు అభివృద్ధి పనులను అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లా యం.పి. రామసహాయం రఘురాంరెడ్డి ప్రారంభించిన అనంతరం అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులలో పాల్గొనడానికి వెళుతున్న సందర్భంగా మార్గమధ్యలో పెద్దగొల్లగూడెం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ తనిఖీలో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. విద్యార్థులకు అందుతున్న వసతి, భోజన సౌకర్యాలను యం.పి. రామసహాయం రఘురాంరెడ్డి, యం.ఎల్.ఎ. జారె ఆదినారాయణ కలిసి పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి హాస్టల్లో అందుతున్న వసతి, భోజన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. నేరుగా వంటశాలకు వెళ్ళి వండివుంచిన అన్నాన్ని, చిక్కుడుకాయ కూర, చారును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సాయంత్రం వేళ సాంబారు,

కోడిగుడ్లు అదించాల్సి వుండగా, మధ్యాహ్నం వండి మిగిలిన ఆహార పదార్ధాలనే సాయంత్రం కూడా విద్యార్థులకు వడ్డిస్తుండడంతో యం.పి. రామసహాయం రఘురాంరెడ్డి, యం.ఎల్.ఎ. జారె ఆదినారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టాక్ రూమ ను పరిశీలించిన యం.ఎల్.ఎ, యం.పి. కూరగాయలు, పండ్లు తీవ్ర అపరిశుభ్ర వాతావరణంలో కుళ్ళి వుండడాన్ని చూసి వార్డెన్ పై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని స్పంష్టం చేశారు.   

విద్యార్థులకు అందుతున్న వసతి, భోజన సౌకర్యాలపై నిరంతరం పర్యవేక్షించాల్సిన ఎ.టి.డబ్ల్యు.ఒ. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాగే చీపురుగూడెం ఆశ్రమ పాఠశాలలో నీళ్ళ మజ్జిగ, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించపోవడంపై ఆగ్రహించిన యం.ఎల్.ఎ. జారె హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసినా అధికారుల్లో మార్పు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న గురుకులాలు, హాస్టళ్ళు, విద్యాసంస్థల్లో కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ అవుతున్న సంఘటనలు తరచూ వెలుగుచూస్తున్నప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదని విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.