28 May, 2026 | 1:56 AM

బక్రీద్ ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్‌పర్సన్

28-05-2026 12:00 AM
  1. ఈద్గాల వద్ద ప్రార్థనలకు వచ్చే వారికి ఇబ్బందులు ఉండవద్దు
  2. మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ 

కామారెడ్డి టౌన్, మే 27 (విజయ క్రాంతి):  ముస్లిం సోదరులకు బక్రీద్ సందర్భంగా మసీదు, దర్గా ల వద్ద ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ఆదేశించారు . బుధవారం కామారెడ్డి పట్టణంలోని ఈద్గాల వద్ద వేగంగా  సాగుతున్న పనుల ను ఆమె పరిశీలించారు. ముస్లింల పవిత్ర పండుగ త్యాగాల నిరతి బక్రీద్ ను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసుకోవడానికి మున్సిపల్ శాఖ తరఫున అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నట్లు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు.

జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన ఈద్గాల వద్ద జరుగుతున్న ముందస్తు పనులను మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో కలిసి ఆమె స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పండుగ రోజున ప్రార్థనలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ తరఫున పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈద్గాల మైదానాలను శుభ్రం చేయాలని శానిటేషన్ అధికారులకు తెలిపారు.

ఈద్గాలకు వెళ్లే దారుల్లో ఉన్న గుంతలను పూడ్చివేయాలన్నారు. వీధి దీపాలను  పునరుద్ధరించి, వెలుతురు సమస్య లేకుండా చూడాలన్నారు. నీటి సౌకర్యం కల్పించాలని కోరారు.  ఈ పర్యవేక్షణ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ హన్మంత్ రావు, కౌన్సిలర్లు గ్యార అఖిల, వాజీద్, అంజాద్, జావీద్, అన్వర్, లడ్డు, నిట్టు గంగాధర్, కో-ఆప్షన్ మెంబర్ అలీబిన్ అబ్దుల్లా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గ్యార సాయిలు, అమీర్, మున్సిపల్ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది మరియు ముస్లిం మత పెద్దలు అమీర్,హైమద్ పాల్గొన్నారు.