24 March, 2026 | 2:24 AM

అసెంబ్లీలో సీఎంతో మునుగోడు ఎమ్మెల్యే భేటీ!

24-03-2026 12:45 AM

హైదరాబాద్, మార్చి 23 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ కౌన్సిల్ హాల్ సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు పది నిమిషాల పాటు సాగిన ఈ ‘వన్-టు-వన్’ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా  మారింది. గత కొంతకాలంగా రాజ గోపాల్ రెడ్డి .. పార్టీ తీరుపై లేదా ప్రభుత్వ నిర్ణయాలపై కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పది నిమిషాల పాటు కేవలం వీరిద్దరి మధ్యే వ్యక్తిగత సంభాషణ జరగడం చూస్తుంటే, తన నియోజకవర్గ సమస్యలతో పాటు రాజకీయ సమీకరణాలపై కూడా చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ భేటీకి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడనప్పటికీ, రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారా.. ? లేక మరేదైనా వ్యూహాత్మక చర్చ జరిగిందా..? అన్నది ఇంకా బహిర్గతం కాలేదు.