30 June, 2026 | 2:10 AM

తాగుబోతు అంటే నాగేశ్వరరావే!

30-06-2026 12:04 AM

నా జీవితం ఒక తెల్లకాగితం 

‘బ్రేకింగ్ న్యూస్’ త్వరలో విడుదల

మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మురళీమోహన్ 

సీనియర్ నటుడు, నిర్మాత మాగంటి మురళీమోహన్ చిత్ర రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును అందజేసింది. ఇటీవలే ఆ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. 

ఈ కార్యక్రమంలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. “చాలా ఇండస్ట్రీల్లో ఎల్లో జర్నలిజం ఉంటుంది. ఎల్లో జర్నలిజం లేనిది కేవలం టాలీవుడ్‌లోనే అని గట్టిగా చెప్పగలను. నా జీవితంలో మొదటి మలుపు గుప్త మాణిక్యాలరావు, అట్లూరి పూర్ణచంద్రరావు మార్చారు. పూర్ణచంద్రరావు నన్ను ‘జగమేమాయ’ అనే సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆయనే నా పేరు కూడా మార్చారు. నా అసలు పేరు రాజబాబు అయితే, ఆ పేరు ఉంది కాబట్టి మోహన్ అని పెట్టారు. ఆంధ్రపత్రిక శ్రీనివాస్ మురళీ అని యాడ్ చేయడంతో మురళీ మోహన్‌గా మారింది. పూర్ణచంద్రరావు పెట్టిన భిక్షవల్లే నేను ఇంత ఎత్తుకు ఎదిగా” అని చెప్పారు. 

మురళీమోహన్ ఇంకా మాట్లాడుతూ.. “పలానా పాత్ర చేయలేకపోయాననే అసంతృప్తి నాకు ఎప్పుడూ లేదు. ‘ముద్దబంతి’ సినిమాలో నీపేరు మారుమోగిపోతుందని దాసరి అన్నారు కానీ, అందులో తాగుబోతుగా నేను చేసిన పాత్ర చాలా మందికి నచ్చలేదు. నాగేశ్వరరావులాగా తాగబోతు క్యారెక్టర్ ఎవ్వరూ చేయలేరు. జీవితంలో తాగుబోతు క్యారెక్టర్ మాత్రం చేయకూడదనుకున్నా. ‘బ్రేకింగ్ న్యూస్’లో నేను హీరోగా చేశా.. త్వరలో విడుదలవుతుంది” అని తెలిపారు. 

“రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నేను నమ్మా. నీతిగా, నిజాయితీ ఉంటూ ఇన్నాళ్లలో ఎక్కడా తప్పు జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నా. ఏ ఇండస్ట్రీలో కూడా నాకు మచ్చ లేదు. నా జీవితం ఒక తెల్లకాగితం. ఎక్కడా ఒక మచ్చ కూడా పడలేదు. పడనివ్వను. మా అబ్బాయి నాకు సినిమాలు ఇంట్రస్ట్ లేదన్నాడు. మా అమ్మాయిని యాక్టర్ చేయాలనుకున్నా. కానీ ఆమెకు కూడా పెద్దగా ఇంట్రస్ట్ లేదని తెలిపింది. సినిమా ప్రొడక్షన్ మీద ఆసక్తి ఉంది కానీ, ఆర్టిస్ట్ అవ్వాలని వారు అనుకోలేదు” అన్నారు మురళీమోహన్.