16-07-2025 01:04:41 AM
-ఫస్ట్ ఫేజ్‌లో 18 పీఎంశ్రీ స్కూళ్ల ఎంపిక
-బడులకు చేరిన తబలా, హర్మోనియం, మృదంగం,
-వయోలిన్ పరికరాలువచ్చేనెల ఫస్ట్ వీక్ నుంచి క్లాసులకు ఏర్పాట్లు
నల్లగొండ టౌన్, జులై 15 : సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఇక నుంచి సంగీత పాఠాలు బోధించనున్నారు. దీంట్లో భాగంగా తొలివిడుతలో నల్లగొండ జిల్లాలో 18 స్కూళ్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయా బడుల్లో వచ్చేనెల ఫస్ట్ వీక్ లో మ్యూజిక్ క్లాసులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.
వీటిలో తొలివిడుతలో ఎంపికైన స్కూళ్లలో మ్యూజిక్ క్లాసులు చెప్పించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. దీనిలో సర్కారు స్కూళ్లతో పాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాలు ఉన్నాయి. ప్రధానంగా తబలా, హార్మోనియం, మృదంగం, వయోలిన్ తదితర పరికరాల ద్వారా సంగీతం పాఠాలు చెప్పించనున్నారు. ఇప్పటికే ఆయా స్కూళ్లకు పరికరాలను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (టీజీటీఎస్) టెండర్ల ద్వారా వేసి స్కూళ్లకు పంపించారు. ఎంపిక చేసిన స్కూళ్లకు పీఎంశ్రీ స్కీమ్ కింద సుమారు రూ.లక్ష చొప్పున అందనున్నాయి. ఆరో తరగతి నుంచి టెన్త్, ఇంటర్ స్థాయి వరకూ ఇంట్రెస్టు ఉన్న స్టూడెంట్లకు సంగీతాన్ని నేర్పించనున్నారు. వారానికి ఒక క్లాసు చొప్పున ఆయా పరికరాలతో ట్రైనింగ్ ఇప్పించనున్నారు.
నెలాఖరు వరకూ టీచర్ల నియామకం..
సంగీత పాఠాలు చెప్పే ఒక్కో స్కూల్‌కు ఒక్కో టీచర్‌ను నియమించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో టీచర్‌కు నెలకు రూ.పదివేల చొప్పున వేతనం ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఈ టీచర్ల ఎంపిక అధికారులకు కష్టంగా మారిపోయింది. ఒక్కొక్కరు నాలుగు పరికరాలను వాయించే వాళ్లు అరుదుగా ఉంటారు. అలాంటి వారు స్కూళ్లకు వస్తారా అనే అనుమానాలున్నాయి.దీంతో వివిధ పరికరాలపై పట్టున్న టీచర్లను ఎంపిక చేసి రోటేషన్ పద్దతిలో స్కూళ్లలో క్లాసులు చెప్పించాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకూ మ్యూజిక్ టీచర్లను ఎంపిక చేసి వచ్చేనెల మొదటి వారంలో క్లాసులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. టీచర్ల ఎంపికకు జిల్లాల్లో ఉన్న బాలభవన్, బాలబడి సహకారం తీసుకోనున్నారు.
జిల్లాల వారీగా ఎంపికైన స్కూళ్లు...
జిల్లాలో మొత్తం 18 స్కూళ్లు ఎంపికయ్యాయి. గుండ్లపల్లి మోడల్ స్కూల్, గుర్రంపోడు మోడల్ స్కూల్, నాంపల్లి మోడల్ స్కూల్, శాలిగౌరారం మోడల్ స్కూల్, మర్రిగూడ మోడల్ స్కూల్, కనగల్ మోడల్ స్కూల్, నిడుమనూరు మోడల్ స్కూల్, మిర్యాలగూడ మోడల్ స్కూల్, పెద్దవూర జిల్లా పరిషత్ హై స్కూల్, వేములపల్లి మోడల్ స్కూల్, దేవరకొండ సోషల్ వెల్ఫేర్, కొండమల్లేపల్లి, సోషల్ వెల్ఫేర్, చింతపల్లి మోడల్ స్కూల్, హాలియా జిల్లా పరిషత్ హై స్కూల్, దామరచర్ల జిల్లా పరిషత్ హై స్కూల్, కట్టంగూర్ కేజీబీవీ, చందంపేట కేజీబీవీ, పీఏ పల్లి కేజీబీవీ, స్కూలు ఎంపికయ్యాయి.