22-05-2025 12:44:45 AM
ఏ ప్రభుత్వలు వచ్చినా చేసిందేమీ లేదు: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
నల్లగొండ టౌన్, మే 21: ఏ ప్రభుత్వలు వచ్చినా ముస్లింలకు చేసిందేమీ లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. బుధవారం నల్లగొండ గడియారం సెంటర్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ భారీ బహిరంగ సభలో మాట్లాడారు.
ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఓటు బ్యాంకుగానే ముస్లింలను వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ గౌరవాన్ని మంట కలపాలని చూస్తున్నదని దుయ్యబట్టారు. ముస్లిం భూములను, మసీదులను ఏ విధంగా పరిరక్షించుకోవాలో తమకు తెలుసు అని పేర్కొన్నారు. ముస్లింలంతా ముక్తకంఠంగా వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మెంబర్స్ మౌలానా జాఫర్ పాషా హుస్సేనీ మాట్లాడుతూ.. బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ముస్లింలను భయభ్రాంతులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. ముస్లిం సమాజానికి తీవ్ర ఇబ్బందులు కలిగించే అన్ని నల్ల చట్టాలు తీసుకొస్తున్నదని ఆరోపించారు.
ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బిల్లును తెచ్చి భయపెట్టాలని చూస్తున్నదని పేర్కొన్నారు. ఎన్ని బిల్లులను తీసుకువచ్చినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్, సీపీఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.