calender_icon.png 22 May, 2025 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్ ను తక్షణం నిలిపివేయాలి

22-05-2025 03:32:56 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 30కి పైగా మావోయిస్టులను హత్య చేయడం దుర్మార్గ చర్య అని, నారాయణపూర్ ఎదురు కాల్పుల ఘటన పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేసి చత్తీస్ గడ్ లో శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా నుద్దేసించి సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆకుల రాజు, సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ నిలిపివేయాలనీ, మేధావులు, ప్రజాస్వామిక వాదులు , మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా కూడా ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పైగా నరమేధాన్ని తీవ్రతరం చేసిందని విమర్శించారు. ప్రతిరోజు ఆపరేషన్ కగార్ పేరుతో ఈ దేశ పౌరులను చంపుతూ మారణకాండ సృష్టిస్తుందని ఆరోపించారు.

అడవి నుండి ఆదివాసీలను ఖాళీ చేయించి, అడవి సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని, ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేసి, బలగాలను వెనక్కి రప్పించాలని, ప్రభుత్వం చేస్తున్న హత్యలపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిలచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ పై ప్రకటించిన ఆపరేషన్ సింధూర్ యుద్దాన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు నాలుగు రోజుల్లోనే విరమించిన మోడీ ప్రభుత్వం, వివిధ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు కోరుతున్నా ఆపరేషన్ కగార్ ను ఆపడం లేదన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో వున్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టటానికి ఒప్పందాలు చేసుకొన్నా ఆదివాసీల ప్రతిఘటనతో అమలు కావటం లేదని, అందుకే ఆదివాసీలను, వారికి మద్దతుగా వున్న మావోయిస్టులను అంతం చేసి అటవీ సంపదను కట్టబెట్ట చూస్తున్నారన్నారు.

ఆపరేషన్ కగార్ కేవలం మావోయిస్టులపై ప్రకటించిన యుద్ధం కాదని, ఈదేశ సంపదను కొల్లగొట్టే యుద్దమమని దీనిని దేశ ప్రజలందరూ వ్యతిరేకించాలని వారు కోరారు. బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు, మిగతా మావోయిస్టు పార్టీ సభ్యులకు వారు నివాళులర్పించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ నరమేధాన్ని ప్రజలూ, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు. ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు సమ్మెట రాజమౌళి, హేమా నాయక్, దుడ్డెల రామ్మూర్తి, ఉపేందర్, మాస్ లైన్ జిల్లా నాయకులు బిల్లకంటి సూర్యనారాయణ, ముంజంపల్లి వీరన్న, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర, జిల్లా నాయకులు బండారి ఐలయ్య, మోకాళ్ళ మురళీకృష్ణ, నందగిరి వెంకటేశ్వర్లు, ఊకె పద్మ, జడ సత్యనారాయణ, హలావత్ లింగ్యా, గుజ్జు దేవేందర్, శివారపు శ్రీధర్, గుగులోత్ సక్రు,బట్టు చైతన్య, గజ్జి లింగన్న  తిరుపతమ్మ, యాకన్న, నేతకాని రాకేశ్, మాదంశెట్టి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.