22-05-2025 04:22:13 PM
అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి..
మహబూబాబాద్ (విజయక్రాంతి): రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులు, గోదాములకు ఎగుమతి చేయాలని మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కె. వీరబ్రహ్మచారి(District Additional Collector K. Veerabrahmachari) ఆదేశించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షాలకు ధాన్యం తడిసిన నేపథ్యంలో గురువారం అదనపు కలెక్టర్ మహబూబాబాద్ జిల్లాలోని కల్వల, తాళ్లపూస పల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించి కాంటాలు నిర్వహించిన ధాన్యం బస్తాలను వెంటనే దిగుమతి చేసుకునే విధంగా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్, మిల్లర్లతో అదనపు కలెక్టర్ మాట్లాడారు.
వెంటనే హమాలీలతో మాట్లాడి సమస్య పరిష్కరించి ధాన్యం ఎగుమతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోలుకు తెచ్చిన ధాన్యం చదవకుండా రైతులకు అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రైతులకు ఇలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు, స్థానిక తహసిల్దార్ కు తెలియజేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ధాన్యం సేకరణ 90 శాతం పూర్తయిందని, వారం రోజుల్లో మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు. అదనపు కలెక్టర్ వెంట కే సముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డి సి ఓ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ పిడి మధుసూదన్ రాజ్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సివిల్ సప్లై డిఎం కృష్ణవేణి తదితరులు ఉన్నారు.