calender_icon.png 22 May, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి

22-05-2025 03:35:33 PM

అధికారపార్టీ నాయకుల జోక్యాన్ని నివారించాలి

మహబూబాబాద్, (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతల జోక్యాన్ని నివారించాలని, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవినీతి అవకతవకలను అరికట్టాలని కోరుతూ మహబూబాబాద్ కలక్టర్ కార్యాలయం ముందు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే ప్రాతిపదికగా నిరుపేదలకు ప్రాధాన్యతా క్రమంలో ఇందిరమ్మ ఇండ్లను, గ్రామసభల ఆమోదంతో కేటాయించాలని డిమాండ్ చేశారు.

అధికార యంత్రాంగాన్ని నామ మాత్రం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్షంగా చేసే ఎంపిక ప్రక్రియను రద్దు చేయాలన్నారు. ప్రజాపాలన పేరుతో అమలు చేస్తున్న పక్షపాత ఏకపక్ష, విధానాలకు స్వస్తి పలకాలని, ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రద్దు చేసి ఇండ్ల ఎంపిక  బాధ్యతను అధికారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. పదేళ్ళ టిఆరెస్ పాలన అవినీతి అక్రమాలతో సాగిందని, తాము అధికారంలోకి వస్తే పారదర్శకమైన ప్రజాపాలన అందిస్తామని హామీయిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి గత ప్రభుత్వాలను తలదన్నే విధంగా ఏక పక్షంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలోన్యూడెమోక్రసీ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, బండారి ఐలయ్య, మోకాళ్ళ మురళీకృష్ణ, ఊకె పద్మ, జడ సత్యనారాయణ,హలావత్ లింగ్యా, గుజ్జు దేవేందర్, శివారపు శ్రీధర్,గుగులోత్ సక్రు,బట్టు చైతన్య,గజ్జి లింగన్న  తిరుపతమ్మ పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు.