12-11-2025 06:57:23 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. జిల్లా రవాణా అధికారి (DTO) జె. శ్రీనివాస్ ఆదేశాల మేరకు, స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో బుధవారం రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళాశాల ప్రిన్సిపల్ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహాయక మోటార్ వెహికల్స్ ఇన్‌స్పెక్టర్లు(AMVI) మధుకర్, కె. ఉదయ్ కుమార్, కృష్ణతేజలు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా AMVI కె. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. తల్లిదండ్రులు హెల్మెట్ ధరించేలా చూడటం పిల్లల బాధ్యత అని గుర్తుచేశారు. జాతీయ రహదారి పక్కన కళాశాల ఉన్నందున విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. తోటి విద్యార్థులలో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసలైనట్లు గమనిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్యార్థులకు రోడ్డు భద్రత నియమావళిపై కరపత్రాలు పంపిణీ చేశారు.