05-12-2024 02:37:36 AM
* ఎంపీ అర్వింద్ పిటిషన్ కొట్టివేత
* ఉత్తర్వులు వెల్లడించిన హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. 2022లో చంచల్‌గూడ జైలు వద్ద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో దళితుల మనోభావాలను దెబ్బతీశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్‌లోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌లో బంగారు సాయిలు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేయగా, అర్వింద్‌పై కేసు నమోదైంది. అనంతరం కేసును మాదన్నపేట పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ ఎంపీ అర్వింద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణను నిలిపివేస్తూ న్యాయస్థానం గత డిసెంబర్‌లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పిటిషన్‌లో వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ బుధవారం తీర్పు వెలువరించారు. అర్వింద్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు వెలువరించారు.