21 March, 2026 | 4:37 AM

ఏఎన్నార్ అవార్డుతో నా సినీ జీవితం పరిపూర్ణమైంది

29-10-2024 12:18 AM

ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం సోమవారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. హైదరా బాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఈ వేడుకకు వేదికైంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. “ఏఎన్నార్ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం.

నాకు పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు అమితాబ్ బచ్చన్ ‘చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్’ సినిమా అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ మాట విని షేక్ అయ్యాను.  మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. అలాంటి మా నాన్న.. నటుడిగా రాణిస్తున్న నన్ను ఎందుకు పొగడరు అనిపించేది. ఓ రోజు అమ్మను అడిగాను. దానికి అమ్మ ‘లేదురా నాన్న చాలా పొగుడుతారు.

ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం” అని కూడా చెప్పింది. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా.

కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటానని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు.

ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ చేతులు మీదగా అందుకున్న రోజు ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. నాకు ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. ఇదే మాట స్టేజీ మీద చెప్పాలనుకున్నాను.

ఇప్పుడు చెప్పాను. ఈ వేడుకలో అమ్మని ముందు సీట్లో కూర్చోబెట్టడానికి ప్రధాన కారణం.. అమ్మ నాగేశ్వరరావుకు సీనియర్ మోస్ట్ ఫ్యాన్. నేను కడుపులో ఉన్నప్పుడు నాగేశ్వరావు సినిమా విడుదలైంది. ఆ సినిమా చూడటానికి జట్కా బండిలో వెళ్తున్నప్పుడు అది కాస్త దారి తప్పి కాస్త పక్కకు దొర్లింది. నాన్న చాలా కంగారు పడ్డారు. ఇంటికి వెళ్లి పోదాం పద అని చెప్పారు.

అయినప్పటికీ అమ్మ సినిమాకు వెళ్దామని పట్టుబట్టింది. ఆ సినిమా అమ్మ చూసింది. అమ్మకు నాగేశ్వరరావు సినిమాలంటే అంత ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లో డాన్సులు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాటలు వచ్చినప్పుడు నా పంథాలో డాన్స్ చేసేవాడిని. నాకు డాన్స్‌లో స్ఫూర్తి నాగేశ్వరరావు.

నాగేశ్వరరావు స్వతహాగా నా డాన్స్‌ను మెచ్చుకుంటూ మాట్లాడడం నాకు ఎంతో నాకు ఎన్నో గొప్ప అవార్డులతో సమానం. ఎన్నో సందర్భంలో ఆయన నా గురించి ప్రస్తావించారు. సినిమా పరిశ్రమ ఇక్కడికి తరలిరావాలని ఆయన చేసిన ప్రయత్నం ఆయన చేసిన కృషి ఈరోజు మనమంతా అనుభవిస్తున్నాం. ఆయన ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పే వారు. ఎన్నో సందేహాలను నివృత్తి చేసేవారు.

ఆయన చాలా సరదా మనిషి. అలనాటి ముచ్చట్లు పంచుకుంటారు. ఆయన నాకు ఒక ఫాదర్లీ ఫిగర్‌లో ఉండేవారు. ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. వాళ్ల కుటుంబం చూపించే ప్రేమకు నేను దాసుడిని. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులకు వచ్చిన ఈ ఏఎన్నార్ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డు రావడం నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని భావిస్తున్నాను” అన్నారు. 

అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ సినిమాకు  నాగేశ్వరరావు చేసిన సేవలు అనితర సాధ్యం. నా మిత్రుడు చిరంజీవికి ఈ అవార్డును నేను ప్రదానం చేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. నేను చిరంజీవి సినిమాలో నటించాను. నాగ్ అశ్విన్ సినిమాలో నటించాను. నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమేనని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది.

ఇకపై నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మెంబర్‌గా తీసుకుంటారని కోరుతున్నాను. నాగ్ అశ్విన్ తన తర్వాతి సినిమాలో తీసుకోవాలని కోరుతున్నాను (నవ్వుతూ)” అన్నారు. నాగార్జున మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్.. ఈ మూడు అక్షరాలే నాకు ప్రపంచం. మా నాన్న అన్నిటికంటే ముఖ్యంగా సినిమాని నమ్మారు. అభిమానులు, ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా ఒక లెజెండ్‌గా నిలిచారు.

భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిల్చే అలాంటి గొప్ప వ్యక్తులను గౌరవించడం ఏఎన్నార్ అవార్డు ముఖ్య ఉద్దేశం. ఈ ఏడాది నా ప్రియ మిత్రుడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో ప్రత్యేకం. కొన్నేళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ ఏఎన్నార్ అవార్డును అందుకోవడం అవార్డు ప్రతిష్టను మరింత పెంచింది’ అన్నారు. ఈ వేడుకలో ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ప్రత్యేకంగా సన్మానించారు.

టీ హీరోలు వెంకటేశ్, రామ్‌చరణ్, దర్శకులు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, నాగ్ అశ్విన్, చందూమొండేటి, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, టీజీ విశ్వప్రసాద్, సునీల్ నారంగ్, స్వప్న దత్, సుబ్బిరామిరెడ్డి, నటులు ప్రకాశ్‌రాజ్, మురళీమోహన్, రమ్యకృష్ణ, అలీ, రాజేంద్రప్రసాద్, రచయిత విజయేంద్రప్రసాద్, అక్కినేని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

* అమితాబ్ రాగానే అక్కినేని ఫ్యామిలీతో పాటు చిరంజీవి ఎదురెళ్లి ఆయన కాళ్లకు నమస్కరించి కార్యక్రమానికి సాదర స్వాగతం పలి కారు. ఏఎన్నార్ పాటల మెడ్లీతో కార్యక్రమం ప్రారంభమైంది. ఏఎన్నార్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో అక్కినేని ఫ్యామిలీ గ్రూప్‌లో జరిగిన చాటింగ్‌ను ప్రదర్శించారు.

ఏఎన్నార్ ఫోటోలు, ఆయన అంతిమ యాత్ర దృశ్యాలను ప్రదర్శించారు. అది చూస్తూ అందరూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఇద్దరు లెజెండ్స్ కథ పేరుతో తెరపై ఒకవైపు ఏఎన్నార్.. మరోవైపు చిరు సక్సెస్ చిత్రాలు, ఆయన అందుకున్న అవార్డులు, ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో కూడిన ప్రోమోను ప్రదర్శించారు.