నా జ్ఞాపకాలు

29-04-2024 12:05:00 AM

అప్పుడు అజంతా ప్రెస్సు మంచి ఉచ్చ దశలో ఉన్నది. సాహిత్య అకాడమీ పుస్తకాలతోపాటు సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశం, తెలుగు స్వతంత్ర వారపత్రిక, స్రవంతి, ఆరాధన పత్రికలు అజంతా ప్రెస్సులో ముద్రణము పొందుతూ ఉండేవి. హైదరాబాదుకు వచ్చే సారస్వత దిగ్గజాలందరూ తప్పకుండా దర్శించదగ్గ స్థానంగా అజంతా ప్రెస్సు ఒప్పుతూ ఉండేది.

 శివంపేట విశ్వనాథశాస్త్రి గొప్ప పౌరాణికుడు. వేదాంత శాస్త్రాధ్యయనం చేసి అల్వాల సంస్కృత కళాశాలలో అద్వైత వేదాంత శాఖాధ్యక్షులుగా ఉన్నవారు. ఖండవల్లి నరసింహశాస్త్రి గారు వ్యాకరణ శాస్త్ర పండితులే కాదు, గొప్ప పౌరాణికులు కూడ. వీరు సహస్రాధిక శ్రీమద్భాగవత పారాయణ పురాణాలను నిర్వహించినారు. 

ఇటువంటి వారే మరొకరు వల్లకొండ నరసింహాచార్యులు గారు. వీరు ద్వైత వేదాంత పండితులు, గొప్ప పౌరాణికులు. ఎన్నో భాగవత సప్తాహాలను నిర్వహించిన వారు. బోడభట్ల శేషాచార్యులు గారు వ్యాకరణ శాస్త్రంలో పిఠాపురం పరీక్ష నిచ్చినారు. జ్యోతిష శాస్త్రవేత్త, పంచాంగకర్త. ఉమ్మెడ గోపాలశాస్త్రిగారు నా బాల్యంలో గొప్ప పౌరాణికులుగా పేరు పొందిన వారు. హస్తాలపురం నరసింహశాస్త్రి గారు భాగవత సప్తాహాలకు పేరు మోసిన వారు. వీరికి శ్రీమద్భాగవతం వాచో విధేయంగా ఉండడం నేనెరుగుదును. ఆవునూరి నరసింహాచార్యులు గారు పౌరాణికులుగా సుప్రసిద్ధులు. 

ఇంకా ఎందరో పండితులు నాకు తెలియని వారు తెలంగాణలో ఉండేవారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చిం తరువాత అనాదరానికి గురియైన వారే. తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేయవలసి ఉన్నది.

నీతి నియమాలతో నియమబద్ధంగా జీవించి గొప్ప ఉపాధ్యాయుడుగా పేరు పొందిన వారు తనికెళ్ల వీరభద్రుడు గారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా ఆంగ్ల శాఖాధ్యక్షులుగా ఉండి, తరువాత రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీసు కమిషనులో సభ్యులయినారు. హైదరాబాదు ఉద్యోగాలు హైదరాబాదీయులకే చెందవలెనని కృషి చేసిన వారు. కోనసీమలో పుట్టినా అక్కడి వారిక్కడ ఉద్యోగాల్లో నిండిపోతే ప్రమాదమని భావించిన వారు.

 అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వైస్ట్ ఉన్న డి.యస్.రెడ్డిగారికి పిహెచ్.డి. పట్టాలేదు. మా ప్రొఫెసరు లక్ష్మీరంజనం గారికిగానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పేరు మోసి, పెద్ద పరిశోధకులయిన మహామహులు చాలామందికి కానీ, డాక్టరేటు పట్టాలు లేవు. కానీ, వారే వారి పర్యవేక్షణలో పనిచేసిన వారెందరికో డాక్టరేటు పట్టాలను ఇప్పించినారు.

యోగిరాజ అమరేశం రాజేశ్వర శర్మ