మన మాణిక్యాలు.. తెలంగాణ ఆదినుండీ అక్షర మాగాణమే!

29-04-2024 12:05:00 AM

తెలుగుభాషకు పునాదులు మన తెలంగాణలో కనిపిస్తున్నాయి. క్రీస్తుపూర్వం నుండి ఇక్కడ తెలుగుభాష ఆనవాళ్లను తెలుగు సాహిత్య పరిశోధకులు, చరిత్రకారులు స్పష్టంగా గుర్తించారు. ఆనాటి కాలం నుండి ఈ ఆధునిక కాలం వరకు కూడా మన తెలంగాణ మాగాణంలో ఎన్నెన్ని కావ్యాలో, ఎన్నెన్ని శాస్త్ర గ్రంథాలో, ఎన్నెన్ని శతకాలో ఉద్భవిల్లి తెలుగు సాహిత్యపు లోగిలిని పచ్చదనంతో నింపాయి. తొలి లిఖితకవిగా గుర్తింపు పొందిన గుణాఢ్యుని ‘బృహత్కథ’ తదనంతర సాహిత్య విస్తృతికి బీజావాపనం చేసింది. మౌఖిక సాహిత్య ప్రభావం నుండి లిఖిత సాహిత్యం రూపు దిద్దుకున్న తరువాత తెలంగాణ నేలనుండి తెలుగు సంస్కృత, ప్రాకృత భాషా సంబంధాల విస్తృతి అధికమైంది. ఈ ప్రాంతపు పాలకులైన శాతవాహనులు, వాకాటకులు, విష్ణుకుండినులు, కందూరు చోడులు, చాళుక్య రాజులు, కాకతీయుల వరకు కూడా సాహిత్యంలో ప్రక్రియా వైవిధ్యం వెల్లివిరిసింది. 

తొలినాళ్లలో గుణాఢ్యుడు, వ్యాఖ్యాతృ సార్వభౌమునిగా యావద్భారతంలో కీర్తి గడించిన కోలాచల మల్లినాథ సూరి, భద్రభూపాలుడు వంటి నీతి శాస్త్రవేత్తలు, మల్లియరేచన అప్పకవి వంటి ఛందోగ్రంథ కవులు, పాల్కురికి సోమన వంటి సర్వతంత్ర స్వతంత్ర రచయితలు, ప్రయోగశీలురు, విద్యానాథుని వంటి మహామహా లక్షణ గ్రంథకర్తలు ఈ నేలపై జన్మించి ఆ సరస్వతీ మాతకు అక్షరార్చన చేశారు. హాల చక్రవర్తి, రుద్రదేవుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు వంటి పాలకులు సైతం రాజ్యపాలనా దురంధరులుగా ఉంటూనే తమతమ ప్రతిభతో వాగ్దేవి సమారాధకులై రచనలతో అలరించారు. తొలి తెలంగాణ కవయిత్రిగా కీర్తి కెక్కిన కుప్పమాంబ రామాయణ కర్తయైన నాటి వర్ధమాన పురపాలకుడైన గోన బుద్ధారెడ్డి కుమార్తె కావడం విశేషం.

ఇక్కడే తొలికథా కావ్యం, తొలి శతకం, తొలిసారిగా ద్విపద కావ్యం వంటి రచనలు వెలుగు చూడటం గమనిస్తే తొలి అడుగుల తెలుగు కవులెందరో తెలంగాణ నేలపై జన్మించి వర్ధిల్లిన వారేగాక, అపారమైన తెలుగు సాహిత్యానికి మార్గదర్శకులై నిలిచి వెలిగిన వారుగా పేరు గడించారు. వారిలో గోకర్ణ చోడుడు, ఎలకూచి బాలసరస్వతి, వేములవాడ భీమకవి, మడికి సింగన, చరిగొండ ధర్మన్న, గౌరన, కృష్ణమాచార్యులు, పోతన్న, గోన బుద్ధారెడ్డి వంటి ఎందరెందరో ప్రాచీన సాహిత్య ప్రపంచంలో చిరకీర్తిని అందుకున్న యశః కాయులుగా దర్శనమిస్తున్నారు. తెలంగాణ సాహిత్య మాగాణంలో పండిన గ్రంథాల పంటతో ఇదొక సస్యశ్యామలమైన భూమిగా మనం భావించవచ్చు.

తెలంగాణ ప్రాచీన సాహితీ సార్వభౌములు, 

వైతాళికుల జీవిత విశేషాలను ఈ శీర్షికలో ప్రతీ వారం చదవండి!