calender_icon.png 20 January, 2026 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా సంకల్పం నెరవేరింది

20-01-2026 01:21:38 AM

  1. దక్షిణాది కుంభమేళాగా మేడారం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

పునరుద్ధరించిన గద్దెల ప్రారంభం  

మంత్రులతో కలిసి తొలి మొక్కు చెల్లింపు

  1. కుటుంబంతో కలిసి పూజలు

ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర 

మేడారం, జనవరి 19 (విజయక్రాంతి): దక్షిణాది కుంభమేళగా, ప్రపంచ ప్రఖ్యాతి పొందే విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలనే తన సంకల్పం నెరవేరిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దల ప్రాంగణాన్ని పునరుద్ధరించడంతోపాటు మేడారం సమగ్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి 251 కోట్ల వ్యయంతో చేపట్టిన పనుల పైలాన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర సహచర మంత్రివర్గ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం మేడారంలో సీఎం ఆవిష్కరించారు.

అనంతరం మేడారంలో గిరిజన దేవతలైన సమ్మక్క సారలమ్మ పునరుద్ధరించిన ఆలయాన్ని ప్రారంభించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు గిరిజన పండు గ మహా జాతర జరగనుంది. కాగా తన కుటుంబ సభ్యులు, మంత్రులతో కలిసి సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తొలి మొక్కులు చెల్లించుకున్నారు. మనవడితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి తులాభారం, వన దేవతలకు నిలువెత్తు బెల్లాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కుంభమేళా తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మహా జాతరను నిర్వహిస్తుందని అన్నారు. ‘జనవరి 19, 2026 నా జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజు. ఈ గడ్డకు పోరాటాల స్ఫూర్తి నింపిన మేడారం సమ్మక ్క సారలమ్మల గద్దెలను ప్రజా ప్రభుత్వంలో పునర్నిర్మించి భక్తులకు అంకితం చేసే పవిత్ర అవకాశం నాకు లభించిన రోజు.

ఈ రోజు ఉదయం కుటుంబ సమేతంగా, సహచర మంత్రుల సమేతంగా వనదేవతలు, జన దేవతలైన సమ్మక్క సారల మ్మ గద్దెలను సందర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న సం దర్భం మరచిపోలేని పవిత్ర జ్ఞాపకం’ అని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు.

మనవడితో కలిసి తులాభారం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొక్కులు చెల్లించుకోవడానికి సోమవారం ఉదయం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం వద్ద మనవడు రేవాన్ష్‌తో కలిసి తక్కెడలో కూర్చుని తులాభారం వేయించుకున్నారు. తాతా మనవడు కలిసి ఇద్దరి బరువు 68 కిలోలు తూగారు. ఈ మేరకు అమ్మవార్లకు 68 కిలోల ఎత్తు బంగారం (బెల్లం) మొక్కు కింద సమర్పించారు. 

జాతరకు మూడు కోట్ల మంది?

గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజుల ’గద్దెలు’లను రాష్ట్ర ప్రభుత్వం 101 కోట్ల రూపాయలతో పునర్నిర్మించింది. 2026వ సంవత్సరం మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 150 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టింది. ఈసారి జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా జాతర నిర్వహణకు భక్తుల సౌకర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. మేడారం మహా జాతరకు ఇస్తున్న ప్రాముఖ్యతను చాటిచెబుతూ సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం మేడారంలో సమావేశమైంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్ వెలుపల జరగడం ఇదే మొదటిసారి.

మేడారం జాతర అనేది ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఇది ధైర్యాన్ని దైవత్వంగా మార్చిందని, కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సమ్మక్క సారలమ్మలను వన దేవతలుగా, కోట్లాదిమంది భక్తులకు ఇలవేల్పుగా విశ్వసించే సమయంలో మేడారంలో ’మహా జాతర’ను జరుపుకుంటారు.