18-12-2025 01:40:20 PM
హైదరాబాద్: హైదరాబాద్ లో బాంబు బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. నాంపల్లి క్రిమినల్ కోర్టును గురువారం మధ్యాహ్నం 2 గంటలకు పేలిపోతుందని గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ పంపించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ వెంటనే అప్రమత్తమై కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. న్యాయస్థానం చుట్టుపక్కల ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రాంగణాన్ని తనిఖీ చేయడానికి ముందు, పోలీసులు సిబ్బందిని, నేరస్థులను కోర్టులో హాజరుపరచడానికి వచ్చిన ఎస్కార్ట్ బృందాలను, ఫిర్యాదుదారులను, ఇతరులను బయటకు పంపి, ముందుగా ఆ ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు.
వివిధ పెండింగ్ కేసులకు సంబంధించిన పనుల నిమిత్తం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు కోర్టుకు వస్తున్నందున, కోర్టు వద్ద అదనపు పోలీసు బృందాలను కూడా మోహరించారు. మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు అధికారులు సైబర్ నిపుణులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, భద్రత చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. వచ్చిన ఈమెయిల్ పోలీసులను, కోర్టు సిబ్బందిని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.