24 March, 2026 | 6:09 PM

వీబీజీ రామ్‌జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

18-12-2025 01:58 PM

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ గురువారం వీబీజీ రామ్ జీ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు 20 ఏళ్ల నాటి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకం స్థానంలో ప్రతి సంవత్సరం 125 రోజుల పాటు గ్రామీణ ఉపాధికి హామీ ఇచ్చే కొత్త పథకాన్ని తీసుకురావాలని కోరుతోంది. వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లుపై జరిగిన ఎనిమిది గంటల చర్చకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాధానమిచ్చారు.

మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా మహాత్మా గాంధీ ఆదర్శాలను నిలబెడుతోందని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ బాపూజీ ఆదర్శాలను చంపిందని, అయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన పక్కా ఇళ్లు, ఉజ్వల యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా ఎన్డీఏ బాపూజీని సజీవంగా ఉంచిందన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చౌహాన్ వివరించారు. బిల్లు ఆమోద సమయంలో విపక్ష నేతలు వెల్ లోకి వచ్చి నిరసన తెలిపారు. అంతేకాకుండా వీబీజీ రామ్ జీ బిల్లు పత్రలు చించి విసిరేశారు. బిల్లు ఆమోదం తర్వాత లోక్ సభ రేపటికి వాయిదా పడింది.