calender_icon.png 18 December, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన గ్రామపంచాయితీ ఎన్నికలు

18-12-2025 02:38:11 PM

సమన్వయంతో పనిచేసిన అధికారులు, సిబ్బందికి ఎస్పీ నితిక పంత్ అభినందనలు

ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై కఠిన చర్యలు 

రూ.6.49 లక్షల విలువ గల మద్యం, గంజాయి, నగదు, చీరలు స్వాధీనం

పోలీస్ బందోబస్తులో ఫారెస్ట్, సింగరేణి, ఎక్సైజ్, ట్రాన్స్‌కో, ఏసీబీ శాఖల సహకారం

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా పరిధిలో మూడు విడతలుగా నిర్వహించిన గ్రామపంచాయితీ ఎన్నికలు అత్యంత ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి నేటి వరకు జరిగిన ఎన్నికల నిర్వహణలో సహకరించిన ప్రజలు, పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సుమారు 800 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు 200 మంది ఇతర శాఖల సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు  తెలిపారు.

ఎన్నికల తేదీలు ఖరారైన నాటి నుంచే జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినంగా అమలు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, భయభ్రాంతులకు గురికాకుండా నిరంతర నిఘా కొనసాగించినట్లు వివరించారు.జిల్లా వ్యాప్తంగా చేపట్టిన విస్తృత తనిఖీలలో ఇప్పటి వరకు రూ.22,000 నగదు, రూ.1,88,156 విలువగల 324 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా రూ.1,94,190 విలువగల 8 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం మరియు 90 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే 18 గంజాయి మొక్కలు, 2.6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకోగా, వీటి విలువ సుమారు రూ.2,45,000గా అంచనా వేశారు. మొత్తం స్వాధీనం చేసిన సామగ్రి విలువ రూ.6,49,346గా తెలిపారు.గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి ముందస్తుగా 959 మందిపై బైండోవర్ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు అధికారులు, ఇతర శాఖల సిబ్బంది చలి, పగలు, రాత్రి లెక్కచేయకుండా విధులు నిర్వహించారని, ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారని ఎస్పీ  ప్రశంసించారు. ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ ఆమె అభినందనలు తెలిపారు.