calender_icon.png 4 December, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జన హృదయంలో చిరస్థానం నర్రా రాఘవరెడ్డి సొంతం

04-12-2025 06:16:43 PM

- అవినీతి మరకలు అంటని ఆదర్శప్రాయుడు 

- సర్పంచ్ నుండి ఆరు పర్యాయాలు చట్టసభలకు 

- ధన బలం, మంద బలం కాదు జనమే ఆయన బలం 

నకిరేకల్ (విజయక్రాంతి): రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు. పదవులు ఎన్నివచ్చినా ఎంత సంపాదించామన్న దానికంటే ప్రజల నాడిని అర్థం చేసుకుని వారి కోసం నిస్వార్థంగా పనిచేసి వారి హృదయాల్లో స్థానం సంపాదించగలగడం నిజమైన నాయకుడి గొప్పతనం. ఈ సత్యాన్ని తన జీవన ప్రయాణంతో నిరూపించిన వ్యక్తిత్వం నర్రా రాఘవరెడ్డిది. చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా 1959లో (నాడు వట్టిమర్తి, శివనేని గూడెం  కలిసి ఉండేవి) సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇదే సమయంలో నార్కట్ పల్లి సమితి ప్రెసిడెంట్ గా ఆయన ఎన్నికయ్యారు. ప్రజాసేవ ప్రారంభించిన రాఘవరెడ్డి క్రమంగా ఆరు పర్యాయాలు నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల అపార విశ్వాసాన్ని పొందారు. బాధ్యత వస్తే హంగులు కాదు పనికే ప్రాధాన్యం అనే ధోరణి ఆయనలో ఎప్పటికీ మారలేదు. అవినీతి దరిచేరనీయకుండా, అభివృద్ధి ముందుండేలా తీసుకున్న నిర్ణయాలు ఆయన ప్రజా జీవితానికి గుర్తింపులయ్యాయి. అధికారంలో ఉన్నప్పుడు అహంకారానికి చోటివ్వని ఆయన పదవి లేని రోజుల్లో కూడా ప్రజల మధ్యే తిరిగి వారి సమస్యలను తెలుసుకునేవారు. "నోరే నా పెట్టుబడి",  “ప్రజల ప్రేమే నా సంపద” అని నమ్మిన ఆయన ప్రజా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన ప్రయాణం ముగిసినా, ఆయన చూపిన విలువలు, నైతికత, నిజాయితీ, సేవ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థానంగా నిలిచాయి.

ప్రజాస్వామ్య విలువల ప్రాధాన్యం 

గ్రామ పంచాయతీ వంటి స్థానిక సంస్థలు ప్రజా పాలనకు అత్యంత సమీప స్థాయి. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు నేరుగా గ్రామ అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. అందువల్ల పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి, ప్రజా ప్రయోజనాన్ని ముందుంచే నిర్వహణ ఇవి గ్రామాల పురోగతికి పునాది స్తంభాలు. జనవైఖరి, సేవా దృక్పథం, నీతి, నిజాయితీ, బాధ్యత ఈ విలువలను ప్రతిబింబించే నాయకత్వం ఉన్నచోట అభివృద్ధి సహజంగానే ముందడుగు వేస్తుంది. ప్రజల భాగస్వామ్యంతో నడిచే స్వచ్ఛమైన పాలన ప్రజాస్వామ్యాన్ని బలపరచే మార్గం కూడా ఇదే.