8 July, 2026 | 1:55 AM

రామప్ప ఉప శివాలయానికి జాతీయ హోదా

08-07-2026 12:00 AM

ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

వెంకటాపూర్, జులై 7 (విజయక్రాంతి): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయ పరిసర ప్రాంతంలో ఉన్న ఉప శివాలయాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యత కలిగిన రక్షిత పురావస్తు కట్టడంగా ప్రకటించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.

బీజేపీ మండల అధ్యక్షుడు పైడకుల మల్లేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇస్తోందని, యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిసరాల్లోని ప్రాచీన ఉప శివాలయానికి కూడా జాతీయ రక్షిత హోదా లభించడం

ములుగు జిల్లా ప్రజలకు గర్వకారణమని, ఈ నిర్ణయంతో ఆలయ ప్రాచీన వైభవం శాశ్వతంగా పరిరక్షించబడటంతో పాటు భవిష్యత్ తరాలకు భారతీయ సాంస్కృతిక వారసత్వం సురక్షితంగా అందుతుందని, అలాగే ఈ హోదా వల్ల ములుగు జిల్లా పర్యాటక, ఆధ్యాత్మిక రంగాలకు మరింత ప్రోత్సాహం లభించి దేశ, విదేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జవహర్ లాల్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణాకర్ రావు, శోభన్, యాదగిరి, శ్రీను, రవి, కుమార్, శ్రీధర్, నాగేశ్వరరావు, మొగిలి, కృష్ణమూర్తి, పార్టీ కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.