ఏఐ రంగంలో తెలంగాణ దిక్సూచి
- సాంకేతికతకు కేరాఫ్‌గా హైదరాబాద్
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- హైదరాబాద్‌లో గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్
- హాజరైన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో ప్రపంచ దేశాలకు తెలంగాణ సరికొత్త దిశానిర్దేశం చేస్తోందని, కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక ప్రయోజనాలను జోడించి ‘ఏఐ’ ప్రమాణాలకు దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసి వేదికగా జరిగిన ఈ ‘గ్రీన్ గ్రోత్ ఎకానమిక్ సమ్మిట్ --ది హైదరాబాద్ కలెక్టివ్’ కార్యక్రమాన్ని, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి మంగళవారం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. ఏఐ అంటే కేవలం క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్లు మాత్రమే కాదని, దీని వెనుక విద్యుత్, నీరు, భూమి, మానవ వనరుల భాగస్వామ్యం ఉంటుందని ప్రభుత్వం గుర్తించిందన్నారు.
పెట్టుబడులను ఆహ్వానించడంలో తెలంగాణ దూకుడుగా ఉన్నప్ప టికీ, అది పర్యావరణానికి, స్థానిక ప్రజలకు మేలుచేసే విధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ క్రెడిట్స్ గురించి చర్చిస్తున్న సమయంలో, తెలంగాణ ’పీపుల్స్ క్రెడిట్’ అనే కొత్త భావనను తెరపైకి తెచ్చిందని వెల్లడించారు.
నీటి వినియోగంలో అత్యంత బాధ్యతాయుతమైన విధానాలను అనుసరిస్తున్న ఏఐ వ్యవస్థలకే తెలంగాణ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ అంటే కేవలం డేటా సెంటర్ల కేంద్రం మాత్రమే కాదు, ఆ డేటా సెంటర్లు ఎలా నిర్మించాలో ప్రపంచానికి నేర్పే ’రోల్ మోడల్’ అని ఆయన గర్వంగా ప్రకటించారు. భవిష్యత్తులో ప్రపంచ ఏఐ ప్రమాణాలను హైదరాబాద్ నిర్ణయించే స్థాయికి తీసుకువెళ్తామన్నారు.






