సహజ పానీయాలు ఆరోగ్యానికి మేలు
ఈసీఐఎల్ చౌరస్తాలో జేవీవీ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ
కుషాయిగూడ మర్చి 19..(. విజయ క్రాంతి) : సహజ పానీయాలను అలవాటు చేసుకొని కూల్డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని కోరుతు జన విజ్ఞాన వేదిక పిలుపు నిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జన విజ్ఞాన వేదిక మేడ్చల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఈసీఐఎల్ చౌరస్తాలో ఉగాది పండగ సందర్భంగా కూల్డ్రింక్ మానేద్దాం సహజ పానీయాలను తాగుదాం అనే నినాదంతో ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన ప్రొఫెసర్ బి.ఎన్.రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పెద్ది శ్రీనివాస్ గుప్తా, వాసవి క్లబ్ కోశాధికారి తారకేశ్వర్ లు మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే కూల్డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరమని, వీటి వినియోగం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. మన పూర్వీకులు అనుసరించిన సహజ పానీయాలు శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయని తెలిపా రు.
ఉగాది పచ్చడి వంటి సంప్రదాయ ఆహారాలు జీవన విధానంలో భాగమని, ఇవి మన సంస్కృతి, ఆరోగ్య పరిరక్షణకు ప్రతీకలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కోశాధికారి పి.నాగరాజు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఉన్నత అధికారులు, జన విజ్ఞాన వేదిక మేడ్చల్ జిల్లా కోశాధికారి జెన్నీ నాయకులు సోమయ్యచారి శేషు, నాగేశ్వరరావు, నరసింహారావు, వెంకయ్య, వెంకట్, అశోక్, స్వామి తదితరులు పాల్గొన్నారు.




