డబుల్ ఇండ్లకు డబ్బులు కావలెను !
- ‘గ్రేటర్’కు 60 వేల ఇండ్లు కేటాయింపు
లాటరీ ద్వారా లబ్ధిదారులకు పట్టాల పంపిణీ
వివిధ దశల్లో నిలిచిన ఇండ్లు 27 వేలు
పనులు పూర్తి చేసేందుకు రూ.2,600 కోట్ల నిధులు అవసరం
నిర్మాణాలు పూర్తయ్యేందుకు మరో ఏడాది
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో తొమ్మిదేళ్ల క్రితం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా డబుల్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించింది. వాటిలో ఇప్పటివరకు 70 శాతం నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 30 శాతం ఇండ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. వాటిని పూర్తి చేసేందుకు నిధులు విడుదలు కావాల్సి ఉన్నది. అవి విడుదలైతే పనులు పూర్తయ్యేందుకు మరో ఏడాది సమయం పడుతుంది.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): 2015లో గ్రేటర్ పరిధిలో మొత్తం 108 ప్రాంతాల్లో గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు 55 ప్రాంతాల్లో 13,881 ఇండ్లు, జీహెచ్‌ఎంసీకి వెలుపల 53 ప్రాంతాల్లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటి పరిధిలో ఇప్పటివరకు 69,781 ఇండ్లు పూర్తి కాగా, అధికారులు వాటిలో 60,126 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. మరో 27,848 ఇండ్లు వివిధ దశల్లో నిలిచిపోయాయి. స్థల వివాదాల కారణంగా 2,500 ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.
ఇండ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ.7,076 కోట్ల నిధులను ఖర్చు చేసింది. మిగిలినవి పూర్తి చేసేందుదుకు మరో రూ.2,600 కోట్ల నిధులు కావాల్సి ఉన్నది. నిర్మాణాలు ప్రారంభమై తొమ్మిదేళ్ల్లు గడిచాయి. ఇప్పటికిప్పుడు రాష్ట్రప్రభుత్వం ఆ నిధులువ విడు దల చేసినా, నిర్మాణాలు పూర్తయ్యేందుకు మరో ఏడాది పడుతుంది. నిధుల విడుదల చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పటికే పలుమార్లు హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌కు లేఖలు రాశారు. కానీ నిధుల విడుదలలో జాప్యం కొనసాగుతూనే ఉన్నది.






