03-07-2025 12:51:22 AM
ఎస్పీ కిరణ్ ఖరే
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జులై 2, (విజయ క్రాంతి): ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు పోలీసులు, వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. బుధవారం టేకుమట్ల పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిబ్బంది వివరాలు, రికార్డుల నిర్వహణ, కేసుల పురోగతి, నేరాలు జరిగే ప్రాంతాలు, తీసుకుంటున్న రక్షణ చర్యలు, శాంతి భద్రతల పర్యవేక్షణ, సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి సమీక్షించారు.
సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసులు పని చేయాలన్నారు. నేరాల అదుపుకు పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు అమర్చి పనిచేసే విధంగా చూడాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని, ప్రజలకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా రక్షణ చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు, చిట్యాల సిఐ మల్లేష్, టేకుమట్ల ఎస్‌ఐ సుధాకర్, సీసీ ఫసియోద్దిన్ పాల్గొన్నారు.