13 May, 2026 | 7:37 PM

నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే

13-05-2026 07:06 PM

- పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్షిక రవి

గుండాల,(విజయక్రాంతి): నీట్ పరీక్ష పత్రాల లీకేజీ, పరీక్ష నిర్వహణలో జరుగుతున్న గందరగోళం పూర్తిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి పర్శక రవి మండిపడ్డారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఒక తెలంగాణలోని 71 వేల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి రాసిన పరీక్షల్లో ఇటువంటి లీకేజీలు జరగడం అత్యంత ఆందోళనకరమని అన్నారు.

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షను కేంద్ర ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. పరీక్ష లీకేజీ వల్ల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్ష నిర్వహించే కేంద్రాలపై నమ్మకం కోల్పోతున్నారని అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ఈ వైఫల్యానికి పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరీక్ష లీకేజీ వల్ల విద్య వ్యవస్థ పరువు అంతర్జాతీయ స్థాయిలో దిగజారిపోయిందని విమర్శించారు. తప్పు చేసిన వారు ఎటువంటి వారైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రవి డిమాండ్ చేశారు.