నీట్ పీజీ ప్రశాంతం
- పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రియాంక అలా
- హైదరాబాద్ జిల్లాలో 97.47 శాతం హాజరు
సికింద్రాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): జిల్లాలో నీట్‌పీజీ 2026 ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. సికింద్రాబాద్లోని ఇన్నోవిజన్ టెక్నాలజీస్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆకస్మికంగా సందర్శించి, పరీక్ష నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కేంద్రంలో కల్పించిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, జామర్ల పనితీరుతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ల విధులను, అభ్యర్థుల ఫ్రిస్కింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు.
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అత్యవసర వైద్య మందులు, పరిశుభ్రత, నిరంతర విద్యుత్ సరఫరా, పవర్ బ్యాకప్ సౌకర్యాలు నిరంతరం అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.తనిఖీలో భాగంగా సంబంధిత కేంద్రంలో మొత్తం 170 మంది అభ్యర్థులకు గాను 163 మంది హాజరయ్యారని, ఏడుగురు గైర్హాజరైనట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నిబంధనలకు అనుగుణంగా పరీక్ష ముగిసేంత వరకు అధికారులు,
సిబ్బంది పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 4 కేంద్రాల్లో మొత్తం 990 మంది విద్యార్థులకు గాను 965 మంది పరీక్షకు హాజరయ్యారని, 25 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా జిల్లాలో 97.47 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సెంటర్ హెడ్ విష్ణుచంద్ర లింగ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.






