విద్య, వైద్య సేవల్లో అలసత్వం తగదు
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): విద్య, వైద్య సేవల్లో అలసత్వం తగదని, విద్య, వైద్య విభాగాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ జిల్లాలోని తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల (బాలికల) ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, హాస్పిటల్, హెల్త్ సెంటర్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో తరగతి గదులు, డార్మెంటరీ, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, టాయిలెట్స్, పరిసరాలను పరిశీలించి విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం కల్పించే పక్కా డైట్ మెనూ ను కచ్చితంగా అమలు చేయాలని, నాణ్యమైన వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని, భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ భోజనం, టిఫిన్స్, స్నాక్స్ సిద్ధం చేయాలని, పిల్లలకు, వసతి గృహాలు పాఠశాలలో భోజనం సిద్ధం చేసే సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి అట్టి నివేదికలను సమర్పించాలని సంబంధిత వార్డెన్, ప్రిన్సిపల్ nu ఆదేశించారు.
అనంతరం కమ్యూనిటీ హెల్త్ ను సందర్శించి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు, మందుల స్టాక్ రిజిస్టర్, తదితర రికార్డులను తనిఖీ చేశారు, హాస్పిటల్ పరిధిలోని సబ్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ద్వారా మెరుగైన వైద్యం ప్రతి ఒక్కరికి అందించాలని సూచించారు, వైద్యం కోసం వచ్చే వారికి సేవలు అందించడం కోసం డాక్టర్స్ నిత్యం అందుబాటులో ఉండాలని, వేసవి ప్రభావం నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని, అవసరం ఉన్నచోట వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని మాత, శిశు మరణాలను జరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది పోలీస్ సంబంధిత విభాగాలు నిత్యం ప్రైవేటు ఆసుపత్రులపై నిఘా పెట్టాలని ఆదేశించారు..అక్రమ స్కానింగ్ లు, లింగ నిర్ధారణ పరీక్షలు నిబంధనలకు విరుద్ధంగా నడిచే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి ధైర్యం భరోసా కల్పించాలని తమ పరిధిలో ఉన్నటువంటి సేవలను వేగంగా అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తొర్రూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గణేష్, సాంఘిక సంక్షేమ శాఖ డిసిఓ జయశ్రీ, ప్రిన్సిపల్ రత్నమాల, హాస్పిటల్ డాక్టర్స్ సుగుణాకర్ రాజు, నందన దేవి, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ పాల్గొన్నారు.




