calender_icon.png 12 November, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర పథకాల అమలులో నిర్లక్ష్యం

12-11-2025 12:58:54 AM

 నిజాంబాద్ ఎంపీ అరవింద్ 

జగిత్యాల అర్బన్, నవంబర్ 11 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన దిశ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, రాజాగౌడ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలపై సమీక్షించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి కోతలు విధించకుండా వరి ధాన్యం సేకరించాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. గ్రామీణ సడక్ యోజన, ముద్ర లోన్స్, నేషనల్ హెల్త్ మిషన్, ప్రధానమంత్రి మత్స్య యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన తదితర పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్ష జరిపారు. సమావేశం అనంతరం  ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఎన్నో పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. కేంద్ర పథకాలను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వాలదే నన్నారు. ఫసల్ బీమా యోజన అమలులో రాష్ర్ట ప్రభుత్వ వైఖరిని ఎంపీ తప్పు పట్టారు.

ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే రైతులను ఆదుకునేందుకు బీమా సౌకర్యం ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టిందని, అయితే రాష్ర్ట ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రాష్ర్టంలో ఫసల్ బీమా యోజన అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తుందని ఇందులో రూ.60  వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుందన్నారు. మిగతా డబ్బులను బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలను అందజేస్తుందని ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

జిల్లాలోని ఇబ్రహీంపట్నం - నడికుడా గ్రామాల మధ్య రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అయితే జిల్లా యంత్రాంగం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ నిధులు మళ్ళి పోయే అవకాశం ఉందన్నారు. నిధులు మంజూరు చేసి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు సర్వే ను పూర్తి చేయలేదని ఎంపీ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు, అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ర్ట ప్రభుత్వం పరస్పర పోటీదారులు కాదని కేంద్రం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందన్నారు.కేంద్రం మంజూరు చేసే నిధులు ప్రజల సొమ్మేనని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ర్ట ప్రభుత్వంపై ఉందన్నారు కేంద్ర పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తే రాష్ట్రాలకు మంచి పేరు వస్తుందన్నారు.

స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవతో జగిత్యాల నియోజకవర్గం లోని మున్సిపాలిటీలకు అత్యధికంగా రు.100 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాకు కేంద్రీయ విశ్వవిద్యాలయం, నవోదయ పాఠశాల ను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు.  గత ఐదు సంవత్సరాలుగా ఉచితంగా రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుందని అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను రేషన్ దుకాణాల్లో కానీ, రైస్ బ్యాగులపై గాని ఉంచకపోవడం శోచనీయమని పలువురు దిశా కమిటీ సభ్యులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు.

ఒక కిలో బియ్యానికి రు.32 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, రెండు రూపాయలు మాత్రమే రాష్ర్ట ప్రభుత్వం ఇస్తుందని అంతమాత్రానికే రైస్ బ్యాగులపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఫోటోలను పెడుతూ ప్రధానమంత్రి ఫోటో పెట్టకపోవడం శోచనీయమని అన్నారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తే ఇంతవరకు స్థలాన్ని కేటాయించలేదన్నారు. జిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన భూమి ఉందని, దానిని కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించాలని కోరినప్పటికీ సంబంధిత  మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నుండి ఎలాంటి స్పందన లేదన్నారు.

రాష్ర్ట మంత్రివర్గంలో అత్యంత అవినీతి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అని అరవింద్ ఆరోపించారు. కమిషన్ లేనిదే ఫైలు కదలదని, కేంద్రీయ విద్యాలయం కు భూమి కేటాయింపు  కోసం కూడా ఏమైనా కమిషన్లు ఆశిస్తున్నాడా.. అని ఎంపీ ప్రశ్నించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు మోర పెళ్లి సత్యనారాయణ రావు, భోగ శ్రావణి, యాదగిరి బాబు, పాత రమేష్, వడ్డేపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.