19-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : పత్తి రైతుల సమస్యలను రెట్టింపు చేసేలా జిన్నింగ్ మిల్లుల యజమాన్యాలు సమ్మెకు దిగడం సమంజసం కాదని, సమస్యలపై సమ్మె విధానంతో కాకుండా సామరస్యంగా కేంద్రంతో పోరాడుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. మంగళవారం సచివాలయంలో సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా, జిన్నింగ్ మిల్లర్ల అసోషియేషన్‌తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి.
జిన్నింగ్ మిల్లుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లను తిరిగి ప్రారంభించాలని మంత్రి కోరారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై ఒక నివేదిక తయారుచేసి కేంద్ర జౌళీ శాఖ అధికారులకు పంపా ల్సిందిగా వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్‌కు మంత్రి ఆదేశించారు.
జిన్నింగ్ మిల్లుల సమస్యల పరిష్కారానికి కేంద్రంతో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా స హకరిస్తుందన్నారు. పత్తి కొనుగోళ్లలో రాష్ర్ట ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకున్నా, రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో జిన్నింగ్ మిల్లుర్ల సమస్యలపై కేంద్రంతో మాట్లాడుతున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
‘కపాస్ కిసాన్’తో ఇబ్బందులు
కపాస్ కిసాన్ యాప్‌తో రైతులకు మరిన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని మంత్రి తెలిపారు. యాప్ నమోదు చేసుకున్న రైతులు తమ పత్తిని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే, అక్కడ కూడా కేంద్రం మరో నిబంధన పెట్టిందన్నారు. సీజన్ మొదట్లో ఎకరానికి 12క్వింటాళ్ల లెక్కన కొనుగోలు చేసి, ఒక్కసారిగా ఆ పరిమితిని 7కు తగ్గించి కొనుగోలు చేస్తామనడంతో, రైతులు తమ మిగిలిన పంటను ఎక్కడా అమ్ముకోవాలో తేల్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇక తేమశాతం అనే మరో కఠిన నిబంధన పెట్టి, రైతులకు ఊపిరిసలపకుండా చేసిందన్నారు.
జిన్నింగ్ మిల్లులను ఎల్1 నుంచి ఎల్ 1,2లుగా విభజించి ఇబ్బందులకు గురిచేసిందన్నారు. ఇప్పటికే మొక్కజొన్న కొనుగోళ్ల పరిమితిని 18 క్వింటాళ్ల నుంచి 25 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. నాఫెడ్ సేకరించే 25శాతం సోయా చిక్కుడు పరిమితిని కూడా ఎకరానికి 6.72 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి గొప్పలు చెప్పు కుంటూ ప్రజలను మోసం చేయాలని చూ స్తున్నారని మండిపడ్డారు.