ఉద్యమానికి ఊపిరిలూదిన ఆర్టీసీ
ఆర్టీసీ ధూం ధాంలో నింగినంటిన తెలంగాణం
27 రోజుల పాటు కొనసాగిన సకల జనుల సమ్మె
రాష్ట్ర సాధనలో కీలక పాత్ర
విభజన తర్వాత పట్టించుకోని ప్రభుతం
తెలంగాణ ఏర్పడి పదేళ్లునా తమ బాధలు తీరలేదంటున్న కార్మికులు
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఉవ్వెత్తున ఎగిసిన మలిదశ తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు ముందు వరసలో నిలిచారు. ఉద్యమాన్ని నడిపించిన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులంతా కలిసి వచ్చి పోరాటం చేశారు. ఉద్యమంలో ప్రగతి రథ చక్రాలు ఆగిపోవడంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. ఎక్కడి బస్సులు అక్కడే నిలిపివేసి రోడ్డుపైనే వంటావార్పుతో నిరసన తెలిపి ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
సకల జనుల సమ్మెలో భాగంగా 27 రోజుల పా టు నిరవధికంగా బస్సులు కదలలేదు. తమ ఉద్యోగాలు పోయినా ఫర్వాలేదనే తెగింపుతో చేసిన పోరాటం ఉద్యమానికి ఊపి రులూదింది. 2024 జూన్ 2తో పదేళ్లు పూర్తి చేసుకుంటున్న స్వరాష్టం.. ఉద్యమం లో ఆర్టీసీ కార్మికులు చేసిన పోరాటాన్ని గు ర్తు చేసుకుంటోంది. సమైక్య రాష్ట్రంలో బస్‌భవన్‌లో 75 శాతం అధికారులు, యూని యన్లలోనూ సీమాం ధ్రకు చెందినవారే అధికం. కార్మికులను నియంత్రిం చేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఎవ్వరూ, ఎక్కడా వెనుదిరగలేదు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ పోరాటం
2011 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 3 వరకు ఉద్యోగుల సహాయ నిరాకరణలో ఆర్టీసీ కార్మికులు ఇందులో కీలంకంగా వ్యవహరించారు. మార్చి 3న నేషనల్ మజ్దూర్ యూనియన్ తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసుకుని అశ్వత్థామరెడ్డిని రాష్ట్ర కన్వీనర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. థామస్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మార్చి 10న మిలియన్ మార్చ్‌లో ఆర్టీసీ కార్మికులు భారీగా తరలివచ్చారు. మార్చి 12న జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు మేరకు 218 మంది కార్మికులతో అశ్వత్థామరెడ్డి వికారాబా ద్‌లో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సెప్టెంబర్ 13 నుంచి సకల జనుల సమ్మెను జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో సమ్మెకు నోటీసునిచ్చింది టీఎం యూ.
సెప్టెంబర్ 19 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఉద్యమం సాగింది. నిత్యం నడిచే బస్సు సర్వీసులున్నీ పూర్తిగా నిలిచిపోయాయి. సమ్మె ఆపేయాలని ఆర్టీసీ యాజమాన్యం బెదిరింపులకు దిగినా వెనక్కి తగ్గలేదు. 50 వేల మంది కార్మికులకు అక్టోబర్ 1న ఇవ్వాల్సిన జీతం చెల్లించలేదు. జీతాలు రాకపోయినా ఉద్యమాన్ని కొనసాగించారు. అక్టోబర్ 11న ఉద్యోగుల మహా ధర్నా కార్యక్రమంలోనూ ఆర్టీసీ కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. అక్టోబర్ 16న సమ్మె విరమించారు. అక్టోబర్ 19న తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఆవిర్భావాన్ని ప్రకటించారు.
ఉద్యమకారులను గుర్తించాలి
స్వరాష్ట్రం సాధించినా మా కార్మికుల బతుకులు మాత్రం బాగుపడలేదు. 9వేల ఆర్టీసీ బస్సులు ఇప్పుడు 6వేలకు వచ్చేశాయి. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంపైన కార్మికులంతా కొండంత ఆశతో ఉన్నారు. 2016 నుంచి కార్మిక సంఘాల ఎన్నికలు లేవు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో కార్మికుల బతుకులున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చి ఆర్నెల్లు దాటినా ఏ హామీలను నెరవేర్చలేదు. యూనియన్ల పునరుద్ధరణ జరగాలి. 14 గంటలకు పైగా విధులు నిర్వర్తించే పరిస్థితి రావడం దారుణం. మహిళా కార్మికులపై వేధింపులు పెరిగిపోయాయి. జూన్ 2నాడు జరిగే ఉత్సవాలకు అసలైన ఉద్యమ కారులను గుర్తించాలి. ఉద్యమ ద్రోహులను దూరం పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
అశ్వత్థామరెడ్డి, టీఎంయూ వ్యవస్థాపక కన్వీనర్
యూనియన్లనే రద్దు చేశారు
ఇప్పటి వరకు ఆర్టీసీ అభివృద్ధి కో సం నయాపైస పురోగతి జరగలేదు. ఉన్న ఉద్యోగాలు తీసేశారు. రాష్ట్ర సాధన తర్వాత కేసీఆర్ మోసం చేశారు. 2014 నుంచి 2023 వరకు ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసుకున్న రూ.3,500 కోట్లను ప్రభుత్వం, యాజమాన్యం వాడుకున్నారు. ఇంత వరకు ఆ డబ్బులు రాలేదు. కాంగ్రెస్ వచ్చాక దాదాపు రూ.800 కోట్లు సర్దుబాటు చేశారు. కేసీఆర్ వచ్చాక యూనియన్లను రద్దు చేశారు. ఉద్యమంలో పాల్గొన్న మిగతా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నా రు. ఆవిర్భావ దినోత్సవం రోజైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. మా సమస్యలను పరిష్కరించాలి. అప్పుడు మేం చేసిన పోరాటానికి ఫలితం దక్కినట్లుగా భావిస్తాం.
పురుషోత్తం ముదిరాజ్,
టీజేఎంయూ ప్రధాన కార్యదర్శి
కుటుంబాలను వదిలి
ఎన్‌ఎంయూ నేతలు మహిమూద్, నాగేశ్వరావును ఎదిరించి ఆ యూనియన్‌ను కాదని బయటకు వచ్చి పోరాటం చేశాం. 27 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. బస్సులన్నీ ఎక్కడివక్కడే ఆపేసి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశాం. కుటుంబాలను వదిలిపెట్టి పోరాటం చేశాం. అప్పుడు జీతాలు వదులుకున్నాం. ఆర్టీసీ ఉద్యోగుల పోరాటం వల్లే ఉద్యమానికి ఊపిరి వచ్చింది. అయితే రాష్ట్రాన్ని సాధించుకున్నామనే భావన పదవీ విరమణ చేసిన మాలాంటి ఉద్యోగులు జీవితంలో మర్చిపోం. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై దృష్టి సారించాలి.
రాజసింహుడు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి
రోడ్డెక్కి ఉద్యమం చేశాం
2001 మార్చి 17 కరీంనగర్ సింహగర్జనలో ఆర్టీసీ నుంచి పెద్ద ఎత్తున పాల్గొన్నాం. మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాం. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వచ్చిన తర్వాతే సమ్మె ఉధృతం అయ్యింది. కోదండరాం సారథ్యంలోనే మేమంతా పనిచేశాం. ఉద్యమంలో ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ ఉద్యోగులది కీలకపాత్ర. డిపోల ముందే వంటవార్పు కార్యక్రమాలు నిర్వహించాం. రాకెట్ స్పీడ్‌లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాని అప్పుడు కేసీఆర్ మెచ్చుకున్నారు. రాష్ట్రం వచ్చాక ఉమ్మడి ఆస్తుల విభజనకు మేం ఢిల్లీకి వెళ్లాం.
థామస్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి






