24-12-2025 09:11:19 PM
వివరాలు వెల్లడించిన డిఎస్పి శివరామిరెడ్డి
నకిరేకల్,(విజయక్రాంతి): మద్యం మత్తులో మామను హత్య చేసిన మేనల్లుడు గట్టు శ్రీకాంత్ ను అరెస్టు చేసినట్లు నల్గొండ డిఎస్పి కె.శివరాంరెడ్డి తెలిపారు. బుధవారం నకిరేకల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 21న తిప్పర్తి రోడ్‌కు చెందిన యలగందుల వెంకన్న (45) తన కుమారుడు రాకేశ్, మేనల్లుడు శ్రీకాంత్, స్నేహితుడు పుట్ట కిరణ్‌తో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో జీతం డబ్బుల విషయమై వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన శ్రీకాంత్ అక్కడే ఉన్న పాల ట్రేతో వెంకన్న తలపై కొట్టాడు.
అనంతరం సిమెంట్ ఇటుకతో దాడి చేయడంతో వెంకన్న తీవ్ర గాయాలతో కుప్పకూలి మృతి చెందాడని తెలిపారు. అడ్డువచ్చిన రాకేశ్‌పై కూడా నిందితుడు దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంకన్నను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు వివరించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో పోలీసులు దర్యాప్తు చేపట్టి బుధవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. గతంలో కూడా నిందితుడిపై కేసు ఉన్నట్లు ఆయన తెలిపారు.ఈ సమావేశంలో నకిరేకల్, శాలిగౌరారం సిఐలు వెంకటేష్, కొండల్ రెడ్డి, ఎస్సై వీరబాబు తదితరులు పాల్గొన్నారు.