మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు కొత్త డైరెక్టర్
హరినాథరెడ్డిని నియమిస్తూ సర్కార్ నిర్ణయం
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మక మూసీ రివర్స్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో కీలక మార్పులు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగంలో ప్రాంతీయ అగ్నిమాపక అధికారిగా పనిచేస్తున్న బీ. హరినాథ రెడ్డిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్)లో డైరెక్టర్ (ప్రాజెక్ట్ కోఆర్డినేషన్)గా నియమించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఆర్డీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రతిపాదనల ఆధారంగా ఈ నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
డిప్యుటేషన్ ప్రాతిపదికన తొలి విడతలో ఏడాది పాటు హరినాథ రెడ్డి ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఫైర్ శాఖలో విధులు నిర్వహిస్తున్న హరినాథ రెడ్డిని తక్షణమే రిలీవ్ చేసి, ఎంఆర్డీసీఎల్‌లో బాధ్యతలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఫైర్ శాఖ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. అలాగే నియామక ప్రక్రియకు సంబంధించిన తదుపరి చర్యలను చేపట్టాలని ఎంఆర్డీసీఎల్ యాజమాన్యానికి సూచించింది. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు నదీ తీరాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, నగర సుందరీకరణ వంటి అంశాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు అమలులో సమన్వయం, పర్యవేక్షణ బాధ్యతలను హరినాథ రెడ్డి నిర్వహించనున్నారు.






