09-07-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): నగరవాసులకు ఆహ్లాదకరమై న వాతావరణాన్ని, ప్రకృతితో మమేకమయ్యే అనుభూతిని అందించేందుకు జూబ్లీ హిల్స్‌లో ఏర్పాటు చేసిన హైకింగ్ ట్రయల్ పార్కు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి ఆయన ఈ పార్కును పరిశీలించారు.
రోడ్డు నంబర్ 36 వద్ద ప్రారంభించి, రోడ్డు నంబర్ 25 వరకు ఉన్న ట్రయల్ మార్గంలో పాదయాత్రగా నడుస్తూ పార్కులోని సౌకర్యాలు, జరుగుతున్న పనులను కమిషనర్ స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, ప్రస్తుతం ఉన్న అభివృద్ధి ప్రణాళికలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని ఇంజనీరింగ్, హార్టికల్చర్ అధికారులకు సూచించారు.
నిర్దేశిం చిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయడంలో ఏమాత్రం జాప్యం వద్దని అధికా రులను హెచ్చరించారు. కమిషనర్ వెంట సర్కిల్ 18 ఈఈ విజయకుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ బాలయ్య తదితరులు ఉన్నారు.